ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి

27-10-2026 | 07:06pm

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

బోధన్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా, గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా విని చట్టపరమైన పరిష్కారం చూపాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్(Police Commissioner P. Sai Chaitanya IPS) పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అన్నారు.

ఆర్మూర్ సబ్‌డివిజన్ పరిధిలోని మెండోరా పోలీస్ స్టేషన్‌ను మంగళవారం పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన, అనంతరం సిబ్బందికి సంబంధించిన కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను సందర్శించి కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమగ్రంగా సమీక్షించారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని కమిషనర్ సూచించారు. బాధితులకు భరోసా కల్పిస్తూ చట్టపరమైన నిబంధనల ప్రకారం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు తమ సమస్యలను ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులకు తెలియజేసేలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు.

మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించకుండా సున్నితమైన అంశాలుగా పరిగణించాలని పేర్కొన్నారు. అవసరమైన ఆధారాలను సేకరించి, నిర్ణీత కాలవ్యవధిలో దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కమిషనర్ మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది 24 గంటలూ తమ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సూచించారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు సన్నద్ధతతో ఉండాలని, దూర ప్రాంతాలకు ప్రయాణాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని తెలిపారు.

పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీసు ఉద్యోగి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురు నాయుడు, ఆర్మూర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ జన్ రెడ్డి, మెండోరా ఎస్‌ఐ జె. సుహాసిని, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు