జూదం ఆడితే జైలుకే!
ఇద్దరికి 30 రోజుల జైలు... మరో ఎనిమిది మందికి రూ.3,000 చొప్పున జరిమానా
నర్సాపూర్ సెప్టెంబర్ 23: జూదం (పేకాట) ఆడుతూ దొరికిన ఇద్దరు వ్యక్తులకు 30 రోజుల జైలు శిక్ష, మరో ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ. 3,000 చొప్పున జరిమానా విధిస్తూ నర్సాపూర్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్(Narsapur Judicial Second Class Magistrate) బాల్ రెడ్డి తీర్పునిచ్చారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
2025లో నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టవిరుద్ధంగా జూదం ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి టీఎస్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ కుమార్ సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో బలమైన ఆధారాలు సమర్పించారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేరం రుజువు కావడంతో అహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన బేగరి కుమార్, జనకంపేట గ్రామానికి చెందిన జక్కుల నర్సింలుకు 30 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (జైలు శిక్ష) విధించారు. ఇదే కేసులోని మిగతా ఎనిమిది మందికి రూ. 3,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదని ఎస్ఐ రంజిత్ కుమార్ హెచ్చరించారు. నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన స్టేషన్ రైటర్ సురేష్, కోర్ట్ కానిస్టేబుల్ హరిబాబు గౌడ్, పోలీస్ సిబ్బందిని ఎస్ఐ అభినందించారు.