కూలిపోయిన పాములేరువాగు వంతెన

23-09-2026 | 11:14pm

గ్రామస్తులు చూడటంతో తప్పిన పెను ప్రమాదం

ములకలపల్లి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district)లోని ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామం - జగన్నాధపురం గ్రామాల మధ్య రాజుపేట కాలనీ దగ్గర పాల్వంచ, దమ్మపేట ప్రధాన రహదారిపై ఉన్న పాములేరు వాగు పై ఉన్న వంతెన భారీ వర్షానికి వచ్చిన ప్రవాహానికి బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో సగం కూలిపోయింది.

ఈ సమయంలో వంతెనపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సమీపంలో ఉన్న రాజుపేట కాలనీ గ్రామస్తులు వంతెన దగ్గరకు చేరుకొని అటు నుంచి ఇటువైపు నుంచి వచ్చే వాహనదారులకు సూచనలు చేయడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

ఈ సమయంలోనే జగన్నాధపురం నుంచి ములకలపల్లి వైపు వస్తున్న ఆటోను చూసిన గ్రామస్తులుఅరుపులు కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ చాకచక్యంగా ఆటోను నిలిపివేయడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది.అందులో ఉన్న ప్రయాణికులు ఊపిరితో బయటపడ్డారు.రాజుపేట కాలనీ సమీపంలో పాల్వంచ- దమ్మపేట ప్రధాన రహదారిపై పాములేరు వాగుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వంతెన కూలిపోయిందని ప్రజలు ఆరోపించారు. ములకలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు వైపులా వాహనాలు రాకుండా సెక్యూరిటీగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు