ప్రజల అవసరాలే ప్రథమ ప్రాధాన్యం
VB-GRAMGపై గ్రామసభ.. పనుల గుర్తింపుపై కీలక చర్చ
కోటపల్లి, (విజయక్రాంతి): గ్రామాభివృద్ధి పనుల ఎంపికలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శెట్‌పల్లిలో VB-GRAMG పథకంపై గ్రామసభ హోరాహోరీగా సాగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మంత్రి గోపీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి మండల MPDO నాగేశ్వర్ రెడ్డి హాజరై పథకం ద్వారా గ్రామానికి కలిగే ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.
గ్రామ MAPను ప్రదర్శిస్తూ గ్రామంలోని అవసరాలను, ప్రతిపాదిత అభివృద్ధి పనులను వివరించిన MPDO.. ప్రజల అవసరాలే ప్రాతిపదికగా పనులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అత్యవసర పనులను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నిబంధనల ప్రకారం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తాత్కాలిక పనులతో సరిపెట్టకుండా.. గ్రామానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం గ్రామసభలో బలంగా వినిపించింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని VB-GRAMG ద్వారా గ్రామాభివృద్ధికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. గ్రామసభలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను గుర్తించడం ద్వారా శెట్‌పల్లిలో మౌలిక వసతుల బలోపేతానికి కొత్త కార్యాచరణకు బాటలు వేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిట్యాల శంకర్, మండల ఉపాధ్యక్షులు తోటపల్లి సుధాకర్ రెడ్డి, వార్డు సభ్యులు సైదల అక్షయ్, జంగిలి రాకేష్, కొట్రంగి మల్లేష్, పంచాయతీ కార్యదర్శి రవళి, APO, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్యాల తిరుపతి, కాసిపేట లచ్చన్న, చిట్యాల రవి, కొత్తపల్లి రాంప్రసాద్, ముల్కల్ల శ్రీనివాస్, అసంపల్లి మోహన్, కాసిపేట రాజన్న, తాండ్ర ప్రభాకర్, కొద్దెన మహేష్, తాండ్ర లింగయ్య, తోడే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.