ఆ రోజు.. ఇన్నర్ రింగ్‌రోడ్, ORR వైపే వెళ్లాలి

23-09-2026 | 05:34pm

హైదరాబాద్, విజయక్రాంతి: హైదరాబాద్‌లో గణేష్ మహానిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సెప్టెంబర్ 25న బాలాపూర్, ఖైరతాబాద్ సహా భారీ గణనాథుల నిమజ్జనం నేపథ్యంలో నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ప్రధాన శోభాయాత్ర కొనసాగనుంది.

NTR మార్గ్, నెక్లెస్ రోడ్(Necklace Road), ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ప్రత్యేక ఆంక్షలు ఉంటాయి. ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. వాహనదారులు ఇన్నర్ రింగ్ రోడ్, ORRను వినియోగించాలని పోలీసులు సూచించారు. MJ మార్కెట్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.

హెవీ కమర్షియల్ వాహనాలు, ట్రైలర్లు, లోకల్ లారీలు, నిర్మాణ వాహనాలపై ఆంక్షలు ఉంటాయి. RTC, ప్రైవేట్ బస్సులకు మళ్లింపులు అమలు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులు PVNR ఎక్స్‌ప్రెస్‌వే లేదా ORRను వినియోగించాలని పోలీసులు సూచించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు