వేయింటింగ్కు చెక్..ఇంటికే మీసేవ
హైదరాబాద్‌లో ఇంటి ముంగిటకే ‘మీసేవ’
ప్రభుత్వ సేవల్లో కొత్త అడుగు
హైదరాబాద్‌లో ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే అవసరాన్ని తగ్గించేలా కొత్త సేవా విధానం అందుబాటులోకి వచ్చింది.‘మీసేవ డోర్ డెలివరీ’(MeeSeva Door Delivery) సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.ఇక పౌరులు 1100కు ఫోన్ చేయడం లేదా మీసేవ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా తమకు అవసరమైన పలు ప్రభుత్వ సేవలను ఇంటి వద్ద నుంచే పొందే అవకాశం ఉంటుంది.
జనన, మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఆదాయం, కులం, నివాస ధృవీకరణ పత్రాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) కాపీలు, పోలీస్ శాఖకు సంబంధించిన సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ సేవలను ఈ డోర్ డెలివరీ విధానంలో పొందవచ్చు. ఈ కార్యక్రమం ప్రత్యేకత కేవలం సర్టిఫికెట్లను ఇంటికి చేర్చడంలోనే కాదు. ప్రభుత్వ సేవలను పొందేందుకు పౌరుడు చేసే ప్రయాణాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్(Pilot project)గా ఈ సేవలను అమలు చేస్తున్నారు. ప్రయోగాత్మక దశలో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా విధానాన్ని మరింత విస్తరించి, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ సేవల డిజిటలైజేషన్‌కు మరో అడుగుగా ప్రారంభమైన ఈ విధానం విస్తృతంగా అమలైతే, ఒకప్పుడు ‘సర్టిఫికెట్ కోసం ఎక్కడికి వెళ్లాలి?’ అనే ప్రశ్నకు బదులుగా ‘ఇంటివద్దకు ఎప్పుడు వస్తుంది?’ అనేది పౌరుడికి మిగిలేలా సేవల అందజేతలో మార్పు తీసుకురావాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం.