రామాయంపేట డివిజన్‌పై మళ్లీ రాజకీయం వేడి

30-09-2026 | 09:09pm

రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట రెవెన్యూ డివిజన్(Ramayampet Revenue Division) అంశం మరోసారి రాజకీయ వేడి రాజేసింది. డివిజన్ కోసం ఉద్యమం చేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి(Former MLA Padma Devender Reddy) చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో రామాయంపేట అభివృద్ధిని పట్టించుకోని వారు.. ఇప్పుడు ప్రజల ముందు కల్లబొల్లి మాటలతో రాజకీయ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.

“నాడు అధికారంలో ఉండి చేయలేనిది.. నేడు ఉద్యమం పేరుతో ఎలా సాధిస్తారు?” అంటూ ప్రశ్నించారు. రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు అదే అంశంపై ఉద్యమం చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. గత పదేళ్లలో రామాయంపేట అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకురాలేదా?”

గత పదేళ్లలో రామాయంపేట అభివృద్ధిని పట్టించుకోని వారు ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త మాటలు చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సహకారంతో రామాయంపేట అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

“డివిజన్ సాధించి చూపిస్తాం”

రామాయంపేట రెవెన్యూ డివిజన్ అంశంపై కాంగ్రెస్ నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించారు. “రామాయంపేట రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్‌తోనే సాధ్యం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో డివిజన్ సాధించి చూపిస్తాం” అని వారు ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు