కొలంగూడ లకు మౌలిక వసతులు కల్పించాలి....

30-09-2026 | 09:52pm
  1. కొలం పీవీటీజీ గ్రామంలో పీవో మంద మకరందు పర్యటన...
  2. సోలార్, తాగునీరు, మునగ సాగు, విద్యాభివృద్ధిపై గ్రామస్థులతో చర్చ..

ఉట్నూర్, సెప్టెంబర్ 30( విజయక్రాంతి ): ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని  కొలం గుడాల తో పాటు పీ వి టీ జీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఐటిడిఏ పిఓ  మంద మకరందు  అధికారులను ఆదేశించారు. బుధవారం(ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Project Officer Manda Makarandu) గాదిగూడ మండలం ఆహ్‌డబ్బా గ్రామపంచాయతీ పరిధిలోని లొద్దిగూడ కొలం పీవీటీజీ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలు, అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరంగా చర్చించారు.

గ్రామస్థులతో మాట్లాడిన పీవో, గ్రామంలో తాగునీటి సౌకర్యం, సోలార్ విద్యుత్, మునగ చెట్ల పెంపకం, విద్యాభివృద్ధి తదితర అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు, స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని జీవనోపాధి అవకాశాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు RO ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అలాగే సౌర విద్యుత్ సదుపాయాల ద్వారా గ్రామస్థులకు నిరంతర విద్యుత్ సౌకర్యం అందించే అవకాశాలను పరిశీలించారు. గ్రామ పరిసరాల్లో మునగ చెట్ల పెంపకం ద్వారా పోషకాహారం, అదనపు ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

గిరిజన పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన పీవో, పాఠశాలలకు పిల్లల హాజరు, విద్యా ప్రమాణాలు, బోధనా విధానం, వసతులు తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించారు. ప్రతి గిరిజన కుటుంబం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ, వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్య ద్వారానే గిరిజన విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో DE Housing, AE Housing, పంచాయతీ కార్యదర్శి, MRO తదితర అధికారులు పీవో వెంట ఉన్నారు. గ్రామస్థులు తెలిపిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిశీలించి, సాధ్యమైన మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పీవో అధికారులకు సూచించారు.

గాదిగూడ ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన...

అనంతరం పీవో మంద మకరందు గాదిగూడ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్య, భోజనం, వసతి, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

 అనంతరం గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన పీవో, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది పనితీరు, రోగుల వివరాలు తదితర అంశాలను పరిశీలించారు. గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు, జీవనోపాధి వంటి అన్ని రంగాల్లో సమన్వయంతో పనిచేయాలని పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు