బీసీ వర్గాలపై అగ్రవర్ణాల కుట్ర
ఎల్ల బాలకృష్ణ
గంభీరావుపేట, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): బీసీ వర్గాలపై అగ్రవర్ణాలు కుట్రలు పన్నుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎల్ల బాలకృష్ణ(Yella Balakrishna) ఆరోపించారు. సిరిసిల్లలో ముఖ్యమంత్రి సభ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఫోటో లేకపోవడం విచారకరమన్నారు. శ్రీనివాస్ బీసీ వర్గానికి చెందిన నాయకుడని, అయినప్పటికీ ఆయన ఫోటో పెట్టకపోవడం బీసీలను అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గంలో బీసీలు అధిక శాతంలో ఉన్నప్పటికీ వారి ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డి వర్గ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరుపతి గౌడ్ నియామకానికి అనంతరం కొంతమంది నాయకులు విభేదాలు రేపుతూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్ల సమయంలోనే నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయని, ఇది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కలుపుకుని వెళ్లాల్సిన నాయకత్వం వర్గ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని అన్నారు.
ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయని గుర్తుచేశారు. పరిస్థితి మరింత విషమించక ముందే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.