అడవుల్లో నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ

28-10-2026 | 08:43pm

వన్యప్రాణులతో పాటు ప్రజలకు నీటి భరోసా కల్పిస్తాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

కోనరావుపేట అక్టోబర్ 28 (విజయక్రాంతి): అటవీ ప్రాంతాల్లో సహజంగా లభించే నీటి వనరులను సంరక్షించి, వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేక చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Vemulawada MLA Adi Srinivas) తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని అడవుల్లోని సహజ నీటి వనరులను పునరుద్ధరించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.

బుధవారం కోనరావుపేట మండలం మరిమడ్ల, రుద్రంగి మండలం మానాల, రుద్రంగి అటవీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి సహజ నీటి వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ డీఎఫ్‌ఓ సత్యనారాయణ, ఎఫ్‌ఆర్‌ఓలు మాధవి, సీతల్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి నీటి లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని సమీక్షించారు.

మరిమడ్ల అటవీ ప్రాంతంలోని జాలవాగు నుంచి గ్రామానికి తాగునీరు అందించే అవకాశాలను పరిశీలించారు. కొండెం చెరువు, ఊర చెరువు, బోటిమే జలాలు తదితర ప్రాంతాల్లో నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించి, ఏడాది పొడవునా ప్రవహించే వాగులు, వంకల నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతులకు చర్యలు అటవీ ప్రాంతాల్లో వర్షపు నీరు వృథాగా దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన చోట చెక్‌డ్యామ్‌లు, చిన్న చెరువులు, కుంటలు నిర్మించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ఇప్పటికే ఉన్న నీటి నిల్వ నిర్మాణాలను పునరుద్ధరించడంతో పాటు మరిమడ్ల–మానాల మధ్య ప్రాంతాల్లోని సీమర్ల ఒర్రె,

సూరమ్మ బుగ్గ ఒర్రె తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.జాలవాగు వద్ద నీటి నిల్వ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైతే పైప్‌లైన్ ద్వారా మరిమడ్ల గ్రామానికి తాగునీరు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తామని వెల్లడించారు. సహజ నీటి వనరులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేందుకు సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.వన్యప్రాణులకు వేసవిలోనూ నీటి సౌకర్యం

అటవీ ప్రాంతాల్లో నీటి వనరులను పునరుద్ధరించడం వల్ల వేసవిలో వన్యప్రాణులు, పక్షులు, ఇతర జీవరాశులకు తాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.నీటి నిల్వల ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పరిసర గ్రామాల్లో నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉందన్నారు.

అటవీ సంపదను కాపాడుతూ సహజ నీటి వనరులను భావితరాలకు అందించేలా సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు