ఓటు హక్కును హరిస్తే సహించేది లేదు
- CEC జ్ఞానేష్ కుమార్ను బర్తరఫ్ చేయాలి
- SIR పేరుతో ఓటర్ల తొలగింపును ఆపాలి
- కలెక్టరేట్ ముందు వామపక్ష పార్టీల నిరసన
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : ఓటు హక్కును హరిస్తే సహించేది లేదని, CEC జ్ఞానేష్ కుమార్ను(CEC Gyanesh Kumar's) బర్తరఫ్ చేయాలని, SIR పేరుతో ఓటర్ల తొలగింపును ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. గురు వారం కలెక్టరేట్ ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పైళ్ళ అశయ్య, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ లు పాల్గొని మాట్లాడారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘమే, ఓటర్ల జాబితాల సవరణ పేరుతో ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. SIR (Special Intensive Revision) ప్రక్రియలో దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించబడినట్లు నివేదికలు వెలువడ్డాయన్నారు.
అర్హులైన ఒక్క ఓటరు కూడా అన్యాయంగా జాబితా నుంచి బయటపడకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు ఏ పార్టీకి చెందిన ఆస్తి కాదని, అది ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు అని, దానిని హరించే ఏ చర్యనైనా వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయని వారు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉండాలి తప్ప, ప్రజల్లో అనుమానాలు కలిగించే కేంద్రంగా మారకూడదని వారన్నారు. ఓటర్ల జాబితాలపై వచ్చిన ప్రతి అభ్యంతరానికి ఎన్నికల సంఘం ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, తొలగించిన పేర్లకు సంబంధించిన వివరాలను బహిరంగపరచాలని, ప్రతి ఓటరుకు తన అభ్యంతరాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై తలెత్తిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలను అడ్డుకుంటామని, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు SIR ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించాలని, CEC జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చట్టపరమైన విచారణలో బాధ్యత లేదా నేరం నిర్ధారణ అయితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం కలెక్టరేట్ AO దేశ్ పాండే శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ , సిపియం, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర, జిల్లా, నాయకులు జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, బొడెంకి చందు, గోమాస ప్రకాష్, T శ్రీనివాస్, మేకల రాములు, లింగం రవి, ఖలీందర్ అలీఖాన్, బ్రహ్మనందం అరుణ, మల్లన్న,దొండ ప్రభాకర్, దూంపల రంజిత్ కుమార్, మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ,మామిడి గోపి, అశోక్, కౌన్సిలర్ మద్దేల శంకర్,దేవి పోచన్న,ఎగుడ మొండి, కొత్తపల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు.