విద్యార్థుల సంక్షేమంలో భాగంగా సి.ఎం. బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మందమర్రి, అక్టోబర్ 8 : ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థుల(Government educational institutions) సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సి.ఎం. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkatswamy) అన్నారు.
గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, తహసీల్దార్ సతీష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి సి.ఎం. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సి.ఎం. బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు చదువుపై మరింత శ్రద్ధ చూపేలా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని తెలిపారు. మందమర్రి మోడల్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక కావడం సంతోషకరమని, తాను ఎం.పి.గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మందమర్రిలో మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయించానని తెలిపారు.
విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణతో చదువుకుంటే ఎంచుకున్న లక్ష్యాలను తప్పకుండా సాధించగలరని తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుండి క్రమశిక్షణ అలవాటు చేయాలని, తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు దోహదపడుతుందని తెలిపారు.
చెన్నూర్ నియోజకవర్గంలో వసతి సదుపాయంతో కూడిన 2,500 విద్యార్థులకు సోమన్‌పల్లిలో రూ. 200 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాదిలో ఈ పాఠశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి,
వాటిని దశల వారీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి, ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.