కీడు సోకిందంటూ ఇండ్లకు తాళాలు వేసి తోటలోకి వెళ్లారు...

08-10-2026 | 04:35pm

సుల్తానాబాద్, అక్టోబర్ 08 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి(Kanukula villagers) ఏదో 'కీడు' సోకిందంటూ గురువారం  ఊరి ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి తోటల్లోకి వెళ్లారు.​గడిచిన రెండు నెలల వ్యవధిలోనే కనుకుల గ్రామంలో(Kanukula villagers) వివిధ అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో 15 మంది మృతి చెందారు అని .

ఒకరి దశదిన కర్మ (దినకార్యం) కాకముందే మరొకరు ప్రాణాలుకోల్పోతుండటంతో గ్రామస్తుల్లో చావు భయం పట్టుకుంది. ఈ వరుస మరణాలన్నీ గ్రామానికి పట్టిన గ్రహచారం లేదా 'కీడు' వల్లనే జరుగుతున్నాయని ఊరి పెద్దలు, ప్రజలు భావించారు.  ​కీడు నివారణలో భాగంగా గ్రామస్తులంతా ఏకమై ఇళ్లకు తాళాలు వేశారు.

పాఠశాలలు, దుకాణాలు, మద్యం షాపులను మూసివేసి ఊరి పొలిమేరలు దాటి పక్కన ఉన్న గ్రామాల్లోని తోటల్లోకి చేరారు. ఇళ్లలో పొయ్యి వెలిగించకుండా, రోజంతా తోటల్లోనే వంటలు చేసుకుని తింటూ 'వనవాసం' లాంటి కార్యక్రమం చేపట్టారు. పొద్దు గుంకిన తర్వాతే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తమ ఊరికి పట్టిన గండం తొలిగి, మరణాలు ఆగుతాయని గ్రామస్తులు  నమ్ముతున్నారు.  

​సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న నేటి కంప్యూటర్ యుగంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలను ఆశ్రయించడంపై చుట్టుపక్కల మండల ప్రజలు, విద్యాధికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్తులలో ఉన్న భయాందోళనలను, మూఢనమ్మకాలను పారద్రోలేందుకు అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మరణాలకు గల అసలు ఆరోగ్య కారణాలను విశ్లేషించాలని, అలాగే సైంటిఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపాలని కోరుతున్నారు..

మరిన్ని వార్తలు