కరెంట్ కోతలను నిరసిస్తూ...
భీమారంలో రైతుల రాస్తారోకో...
చెన్నూర్, (విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గంలోని(Chennur Constituency) భీమారం మండల కేంద్రంలో వ్యవసాయ సాగుకు కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చి, ఆవడం X-రోడ్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
దీంతో జాతీయ రహదారికి ఇరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో ఉన్నతాధికారులకు మాట్లాడించి ప్రస్తుతం ఇస్తున్న కరెంట్ కు అదనంగా మరో 4 గంటల కరెంట్ ఎక్కువగా ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రైతుల ఆందోళనకు BRS మద్దతు...
విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతుకు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి భీమారం మండల BRS పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని మండల నాయకులు పేర్కొన్నారు.