కుల వివక్షపై కేవీపీఎస్ పోరుబాట

30-09-2026 | 09:23pm

అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు 29వ ఆవిర్భావ దినోత్సవాలు

మంచిర్యాల,(విజయక్రాంతి): కుల వివక్ష, దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కేవీపీఎస్‌ పోరాటాన్ని(KVPS struggle) మరింత ఉధృతం చేయాలని ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో 1998 అక్టోబర్‌ 2న ఏర్పడిన కేవీపీఎస్‌ 29వ ఆవిర్భావ దినోత్సవాలను(KVPS Foundation Day Celebrations) అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవాల వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్‌(KVPS District Secretary Durke Mohan) మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల హక్కుల కోసం 28 ఏళ్లుగా కేవీపీఎస్‌ నిరంతరం పోరాడుతోందన్నారు. దళితులపై ఎక్కడ దాడి జరిగినా బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తామని చెప్పారు. కుల వివక్ష కొనసాగుతున్నంతకాలం సామాజిక సమానత్వం కోసం ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అక్టోబర్‌ 2న ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 5 నుంచి 8 వరకు మండల, గ్రామ కేంద్రాల్లో కేవీపీఎస్‌ జెండాలు ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సామాజిక శక్తులు, కుల నిర్మూలనవాదులు, అభ్యుదయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, గోమాస ప్రకాష్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పాయిరాల రాములు, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ దాగం శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు