మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు 26 వేల వేతనమివ్వాలి
AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government Hospital) పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలను రూ. 26 వేలకు పెంచి ఇవ్వాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం గురు వారం RMO టి శ్రీధర్ కి అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
వేతనాల పెంపుదల, చట్ట ప్రకారం పండగ, జాతీయ, ఆర్జిత సెలవుల అమలు, ప్రతి సంవత్సరం బోనస్ చెల్లింపు, ప్రతి ఒక్కరికి 2 జతల యూనిఫారం, ప్రతినెలా 1వ తేదీన వేతనాల చెల్లింపు, ఇయస్ఐ, పిఎఫ్ లు సక్రమంగా కార్మికుల ఖాతాల్లో జమచేయాలని, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలు పెంచేవారు, కానీ ఈ సారి 4 సంవత్సరాలు దాటినప్పటికీ వేతనాలు పెంచలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయినవారికి కనీసం రూ. 16 వేలు చెల్లించాలని జి.ఓ. నెం. 6 జారీ చేసిందనీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పైన పేర్కొన్న ఉద్యోగులు గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులు కాబట్టి వారికి న్యాయమైన పద్దతిలో నెలకు రూ.26వేలు చెల్లించాలని,
అలాగే చట్ట ప్రకారం పైన పేర్కొన్న సెలవులను అమలు చేయించాలని, సంవత్సరానికి ఒక నెల జీతం బోనస్ గా చెల్లించాలని కోరారు. కాంట్రాక్టర్లు ఇస్తున్న మొత్తం వేతనంపై ఇయస్ఐ, పిఎఫ్ లను కట్ చేస్తూ కార్మికుల ఖాతాల్లో మాత్రం చాలా తక్కువ సొమ్మును జమ చేస్తున్నారన్నారు.
చట్ట ప్రకారం కార్మికునికి చెల్లించే పూర్తి వేతనంపై పిఎఫ్, ఇయస్ఐలను మినహాయించగా వచ్చిన సొమ్ముకు అంతే సొమ్మును కలిపి కార్మికుల ఖాతాల్లో జమచేయాలని కోరారు. ఒకవేళ కాంట్రాక్టర్ జమ చేయని ఎడల చట్ట ప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసుపత్రుల్లో ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వెంటనే నూతన కాంట్రాక్టర్లను ఆహ్వానించి కార్మికుల జీతాలు పెంచే విధంగా, కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన సెలవులు, బోనస్ అందే విధంగా ఉన్నత అధికారులతో చర్చించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలిందర్ అలీ ఖాన్, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు రాయమల్లు, మధు, సువర్ణలు పాల్గొన్నారు.