విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా
- ప్రతి ఉద్యోగి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి
- సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
మంచిర్యాల టౌన్ / చెన్నూర్, (విజయక్రాంతి ): విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ప్రతి ఉద్యోగి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి(TGNPDCL CMD Karnati Varun Reddy) కోరారు. గురువారం మంచిర్యాల సర్కిల్‌లో సీఎండీ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొని సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఏ ఒక్క ఉద్యోగి కూడా విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ పనులు చేపట్టే ముందు ఎల్‌సీ యాప్ ద్వారా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, వన్ మినిట్ రూల్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్నప్పుడు హెల్మెట్, సేఫ్టీ గ్లౌజులు ధరించడంతో పాటు ఎర్త్ రాడ్లు, ఇతర రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. సేఫ్టీ ఫస్ట్ అనేది ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో భాగం కావాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ రంగంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదని, వారి త్యాగాలకు నిజమైన నివాళి అర్పించాలంటే విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం అమరవీరుల స్మారక స్థూపం వద్ద మొక్కను నాటారు.
ఈఆర్‌ఓ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సీఎండీ...
మంచిర్యాల సర్కిల్ చెన్నూరులో నూతనంగా నిర్మించిన ఈఆర్‌ఓ కార్యాలయ భవనాన్ని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న చెన్నూరు ఎస్‌పీఎం షెడ్ పనుల పురోగతిని పరిశీలించి, పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
స్థానిక వినియోగదారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంస్థ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలని, పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేస్తూ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రతతో పాటు సంస్థ పనితీరు మెరుగుపడేలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల సర్కిల్ ఎస్‌ఈ బి. రాజన్న, డి.ఈ లు ఖైసర్, రాజేశం, మల్లేశం, ప్రభాకర్, వివిధ విభాగాల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్ల, యూనియన్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .