వైభవంగా శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం
- యాదగిరిగుట్ట లో తోమాల, తులాభార సేవల పునరుద్ధరణ......
- సత్యనారాయణ స్వామి వ్రత మంటపం వద్ద ప్రసాదం విక్రయశాల.....
యాదగిరిగుట్ట, నవంబర్ 12 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారి ఆలయంలో గురువారం స్వామివారి నిత్య పూజలను వైభవంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో సుప్రభాతం, అభిషేకము, అర్చన, సుదర్శన నరసింహ హోమం,నిత్య కళ్యాణంను పండితులు వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం జోడు సేవలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని, తోమాల సేవతో పాటు తులాభార సేవను పునరుద్ధరించారు. తోమాల సేవ.. తోమాల సేవలో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించాలి, తోమాల సేవలో పాల్గొనే భక్తులకు గర్భాలయ ప్రవేశ దర్శనం కల్పించబడుతుంది.
ఒక కళ్యాణం శేష వస్త్రం, కండువాతో పాటు స్వామివారి అభిషేక లడ్డూ ప్రసాదం అందజేయబడుతుంది. ప్రతిరోజూ ఉదయం నిత్య సహస్రనామార్చన అనంతరం సుమారు అరగంట పాటు తోమాల సేవ నిర్వహించబడుతుంది. తోమాల సేవకు 1,250/- రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు. తులాభార సేవ...భక్తుల కోరిక మేరకు స్వామివారి సన్నిధిలో తులాభార సేవను కూడా పునరుద్ధరించడం జరిగింది. భక్తులు ఈ సేవను వినియోగించుకొని తమ మొక్కులను చెల్లించు కోవచ్చని అధికారులు తెలిపారు.
కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని, స్వామివారి ప్రసాద విక్రయశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.