బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరపాలి
నవంబర్ 1న ఢిల్లీ సభకు తరలిరావాలి
ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్ప
మంచిర్యాల,(విజయక్రాంతి): ఓటు హక్కు పరిరక్షణ(Protection of Right to Vote) కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్ప అన్నారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల పట్టణంలోని శుభం కన్వెన్షన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించిందని మరియప్ప పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం తప్పిదాలకు శిక్షలు పడకుండా చట్టాలు రూపొందించారని ఆరోపించారు. జీవనోపాధి కోసం వలస వెళ్లే ప్రజల ఓట్లను తొలగించడం అన్యాయమన్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల వ్యక్తిగత హక్కులు, వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కు, ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమం విజయవంతమైందన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని మరియప్ప పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.