కురుమూర్తి స్వామి సన్నిధిలో వైభవంగా కార్తీక దీపోత్సవం
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి..
భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
చిన్న చింతకుంట నవంబర్ 24: మండల కేంద్ర పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి(Sri Kurumurthy Swamy Temple) వారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం కార్తీక దీపోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొని, ఆలయ మెట్ల వద్ద కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి పరిసర గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేళ ఆలయ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక దీపస్తంభం వద్ద, ఆలయ ప్రాంగణంలో మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
దీపాల కాంతులతో, శంఖు చక్ర నామాలతో కూడిన విద్యుత్ దీపాలంకరణతో ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. భక్తుల గోవింద నామస్మరణతో గిరి క్షేత్రం మార్మోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.