ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో బయటపడిన పురాతన ఆలయ శిఖరం
వేసవిలో కనిపించే ఆలయం.. ఈసారి నవంబర్లోనే దర్శనం
బోధన్, నవంబర్ 24 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriramsagar Project) (ఎస్సారెస్పీ) బ్యాక్వాటర్లో పురాతన ఆలయ శిఖరం మరోసారి వెలుగులోకి వచ్చింది. డొంకేశ్వర్ మండలం కుస్తాపురం సమీపంలో ఉన్న పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం ప్రాజెక్టు నీటిమట్టం తగ్గడంతో బయటపడింది.
సాధారణంగా వేసవి కాలంలో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన సమయంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆలయ శిఖరం నీటి నుంచి బయటకు కనిపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా నవంబర్ నెలలోనే ఆలయ శిఖరం బయటపడటం స్థానికులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రాజెక్టు నీటిమట్టం సాధారణ సమయానికి ముందే తగ్గడంతో పురాతన ఆలయ శిఖరం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం మరోసారి వెలుగులోకి రావడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.