యూత్ కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే కనకయ్య దిశానిర్దేశం

24-11-2026 | 08:17pm

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలి..

యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) యువజన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకుపల్లి నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేసే బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావించాలని, దేశం కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని గాంధీ కుటుంబం సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాగాంధీదేనని, ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా పదవిని త్యజించి దేశ సేవకు అంకితమైన గొప్ప చరిత్ర గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. జెన్‌జీ తరానికి చెందిన యువత కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి ఎదిగేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు వాస్తవాలతో సమాధానం చెబుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఇల్లందు ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడం, ఉన్న బొగ్గు గనులు మూతపడటం, సీతారామ ప్రాజెక్టు నీటిని అందిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంపై విమర్శలు చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

అనంతరం నియోజకవర్గం, మండల స్థాయిలో నూతనంగా నియమితులైన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఈసం లక్ష్మణ్, పాకలపాటి సాగర్, మాళోత్ ప్రేమ్‌కుమార్, ఇల్లందు, గార్ల, కామేపల్లి, బయ్యారం మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూనెం మధు, రాజీవ్, దొడ్డ వేణు, సతీష్, టేకులపల్లి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చీలువేరు చంద్రశేఖర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు కంపాటి వీర, షేక్ పాషా, నిమ్మల అఖిల్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు