బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టింది

05-10-2026 | 09:18pm

నూతన పాఠశాల భవనం ప్రారంభం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

చిన్నచింతకుంట: బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసి భ్రష్టుపట్టించారని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) విమర్శించారు. సోమవారం మండలంలోని ఉంద్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ.30 లక్షల నిధులతో నిర్మించిన నూతన జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల(ZPHS School) భవనాన్ని ఎమ్మెల్యే జీఎంఆర్‌ ప్రారంభించారు. అనంతరం రూ.20 లక్షల నిధులతో నిర్మించనున్న హెల్త్‌ సబ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.

అలాగే రూ.32.50 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాల కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 55 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudan Reddy) మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

ఉంద్యాల గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల భవన నిర్మాణంపై దృష్టి సారించి రూ.30 లక్షల నిధులు కేటాయించిందన్నారు. నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గ్రామంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

మూడు చెరువులకు నీళ్లు అందిస్తా 

చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల గ్రామంలోని జమ్మికుంట, నల్లకుంట, ఎర్రకుంట చెరువులకు కోయిల్ సాగర్ స్టేజ్–1 నుంచి నీటిని తరలించే అంశంపై అధికారులు, స్థానిక రైతులతో ఎమ్మెల్యే జిఎంఆర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి చెరువులకు నీటిని అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.

ఉంద్యాల పంప్ హౌస్ కోయిల్ సాగర్ స్టేజ్–1 నుంచి ఈ మూడు చెరువులకు నీటిని అందిస్తామని ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ప్రకటించారు. చెరువులకు నీరు అందుబాటులోకి వస్తే ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా పెరగడంతో పాటు భూగర్భ జలాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతుల సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జియంఆర్ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎల్లన్న, ఎంపీడీవో అనురాధ, దేవరకద్ర మార్కెట్‌ చైర్మన్‌ కథలప్ప, సింగిల్‌ విండో చైర్మన్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, సర్పంచ్‌ కోట్ల ఆంజనేయులు, మండల అధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు దామోదర్‌ యాదవ్‌, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు