సింగరేణి చరిత్రలో తొలిసారి ఆయిల్ పామ్ తోటలు

05-10-2026 | 10:27pm

- కేకే 2 గనిపై మొక్కలు నాటిన అధికారులు...

మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో బొగ్గు తవ్వకాలు పూర్తయిన భూములను పర్యావరణహితంగా వినియోగించడంలో భాగంగా సింగరేణి(Singareni) యాజమాన్యం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎమ్‌డీ డాక్టర్ బుధ ప్రకాష్ జ్యోతి దిశానిర్దేశంలో, డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు, జీఎం (ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్) బి. సైదులు పర్యవేక్షణలో మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ నాయకత్వంలో మూసివేసిన కెకె-2 భూగర్భ గని ఆవరణలో ఆయిల్ పామ్ తోటల(Oil Palm Cultivation) పెంపకాన్ని ప్రారంభించారు.

సింగరేణి 135 ఏళ్ల చరిత్రలో బొగ్గు గనుల భూముల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకం చేపట్టడం ఇదే తొలిసారి, ఏరియా నర్సరీ వెనుక సుమారు 2 హెక్టార్లలో 285 ఆయిల్ పామ్ మొక్కలను సోమవారం నాటారు. అధికారులు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ఇతర గనులకు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు