రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

17-10-2026 | 07:18pm

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

ట్రాన్స్‌ఫార్మర్లు, స్ప్రింక్లర్ల,  వేరుశనగ విత్తనాల పంపిణీ 

భూత్పూర్, అక్టోబర్ 17 : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) ధ్యేయమని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(G. Madhusudan Reddy) అన్నారు. శనివారం భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద మండల రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన రైతులకు స్పింకర్లు , వేరుశనగ విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలని, సాగునీటిని పొదుపుగా వినియోగించుకుంటూ అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.

ఎల్ నినో ప్రభావంతో రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని రైతుల అవసరాలకు అనుగుణంగా లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు. నీటి వృథాను తగ్గించేందుకు స్ప్రింక్లర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మాజీ మంత్రి  హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో స్పందించారు.కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెట్టింది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు,

కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో అప్పటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉంటే నేడు పాలమూరు జిల్లా కు సాగునీటి విషయంలో ఈ దుస్థితి వచ్చేది కాదని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కంటే ఆలస్యంగా ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన బిఆర్ఎస్ పాలకులు.. పాలమూరు ప్రజల జీవనాడి అయిన పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని హరీశ్‌రావును నిలదీశారు.

ఆనాడు సాగునీటి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్‌రావు పాలమూరు ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే  మండిపడ్డారు.  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావడంలో పాలమూరు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు విఫలమయ్యారని విమర్శించారు. భూత్పూర్ మున్సిపాలిటీలో 35 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న విద్యుత్ సెక్షన్ కార్యాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఈ భీమా నాయక్, డిఈఈ చంద్రమౌళి, ఏడి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్, మండల ఉద్యాన అధికారి కే. శృతి, అధికారులు ఖాదర్, బాలరాజ్, పాషా, నరసింహారెడ్డి, సురేష్, రాము నాయక్, చంద్రశేఖర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు