కోనరావుపేటలో మాటలకే పరిమితమైన అభివృద్ధి
పాలకుల నిర్లక్ష్యంపై బీజేపీ ఆగ్రహం.
కోనరావుపేట, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopeta Mandal) కేంద్రంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, పాలకులు మారినా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని బీజేపీ నాయకులు(BJP leaders) విమర్శించారు.శనివారం మండల కేంద్రంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు గొట్టె రామచంద్రం(Gotte Ramachandram), మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్(Bairagoni Suresh Goud), సీనియర్ నాయకులు దుర్గం తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS government) హయాంలో ప్రారంభమైన ఆడిటోరియం నిర్మాణం నేటికీ అసంపూర్తిగా ఉండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడం దారుణమన్నారు.ఆడిటోరియం ఎదుట మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో పరిసరాలు అధ్వానంగా మారాయని, భవనంలోకి వెళ్లేందుకు సరైన దారి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా కోనరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రహరీ గోడ నిర్మించకపోవడం, పోలీస్ స్టేషన్ సమీపంలోని కల్వర్టు వద్ద సీసీ రోడ్డు వేయకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు.
మండల కేంద్రంలోని రహదారులపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రచారంలో ఘనం.. ప్రగతిలో శూన్యం అన్న చందంగా ప్రస్తుత పాలన కొనసాగుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న ఆడిటోరియం నిర్మాణం, ఆసుపత్రి ప్రహరీ గోడ, డ్రైనేజీ పనులు, రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.