కురుమూర్తి స్వామి జాతరలో విషాదం..

05-11-2026 | 06:02pm

గుడారాలు ఏర్పాటు చేస్తుండగా అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి జాతరలో(Kurumurthy Swamy Jathara) విషాద ఘటన చోటుచేసుకుంది. జాతరలో గుడారాలు ఏర్పాటు చేసేందుకు కూలీ పనులకు వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన పెంటయ్య (55) కురుమూర్తి స్వామి జాతరలో గుడారాలు ఏర్పాటు చేసేందుకు కూలీగా వచ్చాడు.

పనులు చేస్తుండగా ఒక్కసారిగా మూర్ఛ రావడంతో అక్కడే ఉన్న తోటి కూలీలు వెంటనే స్పందించి ఆటోలో చిన్నచింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పెంటయ్య మృతి చెందాడు. పెంటయ్య మృతితో తోటి కూలీలు, పరిచయస్తులు విషాదంలో మునిగిపోయారు. జాతరలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని వార్తలు