గురుకుల పాఠశాలలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మహమ్మదాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల పరిధిలోని నంచెర్ల గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్(Additional Collector Madhusudan Naik) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, తాగునీరు, వసతి, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన అదనపు కలెక్టర్ ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆహార తయారీ, నిల్వ, వడ్డింపులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తనిఖీలో గుర్తించిన లోపాలపై బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆర్‌సీఓను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని, నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.