దేశాభివృద్ధిలో ఇందిరమ్మ పాత్ర మరువలేనిది

31-10-2026 | 03:01pm

హుజురాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న (Bharat Ratna) స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు అన్నారు.

శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి (Indira Gandhi Death Anniversary) సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మనోజ్ రావు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంతో పాటు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు.

బ్యాంకుల జాతీయీకరణ (Bank Nationalisation), హరిత విప్లవానికి ప్రోత్సాహం, వ్యవసాయ రంగ అభివృద్ధి వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని అన్నారు. మహిళా నాయకత్వానికి ఆమె ఆదర్శంగా నిలిచారని, దేశం కోసం చేసిన త్యాగాలు, సేవలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, కౌన్సిలర్లు సొల్లు సునీత, కోయల్కార్ భారతి, పుణ్యలత, కాళీ హుస్సేన్, శ్రీనివాస్, కాజీపేట శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, సందమల్ల బాబు తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు