అంజిలి పెళ్లిపై షర్మిల సంచలన నిర్ణయం

31-10-2026 | 11:34am

యలహంక ఇంట్లో పెళ్లి రద్దు.. షర్మిల కీలక నిర్ణయం!

నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.

అమరావతి: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని యలహంక నివాసంలో జరగాల్సిన పెళ్లిని మరో ప్రదేశంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె Social Media వేదికగా ప్రకటించారు. వివాహ వేదిక విషయంలో వివాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ఎలాంటి గొడవలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా యలహంక ప్రాపర్టీపై కూడా షర్మిల తన వివరణ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తుల పంపకాల్లో భాగంగా, అప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక నివాసం పూర్తిగా తనకు, తన పిల్లలకు చెందిందని పేర్కొన్నారు. ఈ విషయం దేవుడి సాక్షిగా నిజమని వెల్లడించారు. తన తండ్రి వైఎస్సార్ తిరిగిన ఇల్లు కావడంతోపాటు, అది తన పిల్లల హక్కుగా వచ్చిన ఆస్తి కావడంతో కుమార్తె అంజిలి కోరిక మేరకు అక్కడే వివాహం చేయాలని భావించినట్లు తెలిపారు. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయమని, అయితే తాను పెరిగిన ఇంట్లోనే పెళ్లి జరగాలన్న కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన కుమార్తె గురించి ఆలోచించి, బాధపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని షర్మిల వెల్లడించారు. ఈ వేడుకను వివాదరహితంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. అందుకే Wedding Venue మార్చాలని నిర్ణయించినట్లు వివరించారు. బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో మరో వేదికపై వివాహ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు