నీళ్లు, కరెంట్ పొదుపుగా వాడుకోండి
- ప్రజలు, పశువుల తాగునీటికే ప్రాధాన్యం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
- రైతులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
- యాసంగిలోవరి, పత్తి వేయొద్దు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, అక్టోబర్ 12 ( విజయ క్రాంతి) : ఎల్- నినో ప్రభావ(El Nino effect) పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని జల, ఇంధన వనరులను(Water and energy resources) రైతులు అత్యంత పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎల్- నినో నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రైతు నేస్తం కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్(Video conference with farmers) ద్వారా మాట్లాడారు.
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, 2027 వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలు వేసినట్లు తెలిపారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం కారణంగా విపత్కర పరిస్థితులే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్, జులై వరకు రాష్ట్రంలో వర్షాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నీటి వనరులను కేవలం తాగునీటి సౌకర్యానికే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.
మంచినీటి ఎద్దడి, ఆహార ధాన్యాల కొరత, పశువులకు దాణా, నీటి సౌకర్యం కల్పించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని తెలిపారు. ఇప్పటికే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని, రైతులను చైతన్య పరుస్తున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం కలిగే చర్యలను ప్రోత్సహించమని, పంట నష్టాలను తగ్గించే ప్రయత్నాలను చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న నీటిని కేవలం తాగునీటికి, పశువులకు నీటి వసతికి మాత్రమే వాడుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, రైతులు ఈ యాసంగిలో వరి, పత్తి పంటలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు పండించాలని, ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం వేసవి తీవ్రత 50 సెంటిగ్రేడ్లకు చేరుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికీ, 315 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయిందని వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాల మేర వరి సాగు విస్తీర్ణం తగ్గిందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా, భూగర్భ జలాల లభ్యతపై వాస్తవ పరిస్థితులను రైతులకు తెలియజేయాలని పేర్కొన్నారు.
10 నెలలు తాగునీటికే ప్రాధాన్యం:- సీఎస్
రాష్ట్రంలో, గత ఏడాదితో పోల్చితే, ఈసారి దాదాపు 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. రాష్ట్రంలోని కృష్ణా బేసిన్‌లో 270 టీఎంసీ లకు బదులుగా 80 టీఎంసీల నీరు, గోదావరి బేసిన్ లో 150 టీఎంసీలకు 100 టీఎంసీల నీరే వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత మేరకు వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదని, రానున్న 10 నెలలు ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం, నీటి వసతికే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి వీబీజీ రాంజీ (ఉపాధి హామీ ) పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు వెల్లడించారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు:- సురేంద్ర మోహన్
రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం రోజురోజుకు పడిపోతున్నందున అతితక్కువ నీటిని ఉపయోగించుకునే ఆరుతడి పంటలనే వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ సూచించారు. ఎల్ నినో ప్రభావంపై రైతు నేస్తం ద్వారా రైతులను చైతన్య పరుస్తూనే ఉన్నామని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ యాసంగిలో వరి, పత్తి పంటలను వేయొద్దని సూచించారు. బిందు సేద్యంతో పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు.
పెరగనున్న ఉష్టోగ్రతలు: వాతావరణ శాఖ
ఎల్ నినో వల్ల ఉష్టోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారి డా. స్రవంతి పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్‌లలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని, 37 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చన్నారు. ఈ సారి రుతుపవనాల ప్రభావం కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని హెచ్చరించారు.
మేజర్ రిజర్వాయర్లలో నీళ్లు లేవు: నీటి పారుదల శాఖ
రాష్ట్రంలోని మేజర్ , మైనర్ నీటి ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటిని 2027 జులై వరకు తాగు నీటి అవసరాల కోసం నిల్వ చేస్తున్నామని నీటి పారుదల శాఖ ఈఎన్‌సి తెలిపారు. గత సంవత్సరం వివిధ ప్రాజెక్టుల ద్వారా 37.56 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తే, ఈ సారి ఎల్- నినో ప్రభావంతో కేవలం 7 లక్షల ఎకరాలకే అందించినట్టు పేర్కొన్నారు.
తాగునీటి సరఫరాకు ప్రణాళికలు: దాన కిశోర్
రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పంచాయతీ రాజ్, తాగునీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ వెల్లడించారు. డిసెంబర్ వరకు ఏవిధమైన ఇబందులు లేకుండా నీటి సరఫరాను అందించగలుగుతామన్నారు. తిరిగి, డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.39 కోట్ల పశువులు, జీవాలున్నాయని, వీటికి పశుగ్రాసం, నీటి వసతులను కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తి వెల్లడించారు.
నీటిని తక్కువగా ఉపయోగించే పెసర్లు, మినుములు, శనిగలు, వేరుశెనగతో పాటు, సన్ ఫ్లవర్, నువ్వులు, కుసుమల వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్ర వేత్తలు సూచించారు. వరికి క్రాప్ హాలీడే ప్రకటించాలని పేర్కొన్నారు. కూరగాయలను కూడా విస్తృతం గా వేయాలన్నారు.
కొందామన్నా కరెంట్ ఎక్కడా లేదు: నవీన్ మిట్టల్
కొనుగోలు చేద్దామన్న ఎక్కడా కూడా విద్యుత్ అందుబాటులో లేదని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. జలాశయాలలో నీటి లభ్యత లేనందువల్ల, గత సంవత్సరం కంటే ఈసారి 25 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. గత నెల సెప్టెంబర్ 30 వ తేదీన 19,892 మెగావాట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగమైందని వెల్లడించారు.