ఆర్టీసీ బస్సుల్లో దసరా రద్దీ
- తొలి 3 రోజుల్లోనే కోటి నలభై లక్షల మంది ప్రయాణం
- డిమాండ్‌కు తగినట్లుగా అదనపు బస్సు సర్వీసులు
- అధికారులకు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో(RTC bus) దసరా రద్దీ(Dasara rush) కొనసాగుతోంది. విద్యాసంస్థలకు(Educational institutions) సెలవులు రావడంతో ప్రజలు సొంతూరు బాటపడుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులకు(RTC special bus services) ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈనెల 9, 10, 11 తొలి 3 రోజుల్లోనే కోటి నలభై లక్షల మంది ప్రయాణించారని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి(Y Nagireddy) తెలిపారు. దసరా పండుగ రద్దీ, అదనపు బస్సుల ఆపరేష న్లపై నాగిరెడ్డి సోమవారం అధికారులతో జూమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సర్వీసులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. గత ఏడాది (2025) దసరా తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులను నడపగా... ఈ ఏడాది అక్టోబర్ 9, 10, 11 తేదీలలో గతంతో పోలిస్తే 495 బస్సులు అదనంగా నిడిపామన్నారు. అంటే మొత్తం 1,417 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అదేవిధంగా ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా దసరా పండుగ వేళ మహిళలకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతోందని, గత ఏడాది దసరా సమయంలో రోజుకు సగటున రూ. 13.02 కోట్లు ఆదా కాగా, ఈ ఏడాది మహిళలు రోజుకు రూ.13.73 కోట్ల మేర ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. పండుగ ముందు రద్దీని దృష్టిలో ఉంచుకుని సొంత ఊళ్లకు ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడా అదనపు బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్, ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు.