మాకేవీ పదవులు?
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో నామినేటెడ్ పదవుల కోసం జాతీయ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు
పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన
కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉంటున్నా పదవులు దక్కడం లేదని నేతల్లో అసంతృప్తి
* తెలంగాణ బీజేపీ వర్గాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదే నామినేటెడ్ పదవులు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉంటున్నా, రాష్ట్ర నేతలకు పట్టుమని పది పదవులు కూడా దక్కలేదనే ఆవేదన బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ బోర్డులు, కార్పొరేషన్లలో తెలంగాణకు అవకాశం వస్తుందని ఆశపడ్డ నేతలకు నిరాశే మిగులుతోంది. ఆశించిన స్థాయిలో పదవులు దక్కకపోవడంతో నేతల్లో అసంతృప్తి నెలకొంది.
అక్టోబర్ 12 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో(Central Public Sector Undertaking) తమకు నామినేటెడ్ పదవులు(Nominated posts) ఎప్పుడిస్తారంటూ రాష్ట్ర కమలనాథులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన నేతలు ఇప్పుడు ‘మాకు దక్కింది ఏమిటి?’ అని ప్రశ్నిస్తుండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ కోసం ఎంత పనిచేసినా తమను పట్టించుకోరా? అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుర్తింపేది?..
ఢిల్లీ పెద్దలు తెలంగాణ నేతలపై(Telangana leaders) కరుణ చూపరా?, మా బాధలు వినరా? అంటూ లోలోపల వారు మదనపడుతున్నారట. తమను పట్టించుకునే తీరిక ఢిల్లీ జాతీయ నాయకత్వానికి(Delhi national leadership) లేదా? అని అనుచరులకు తమ బాధనంతా వెళ్లగక్కుతున్నారని తెలిసింది. పార్టీ కోసం అహర్నిషలు కష్టపడే నాయకులు బీజేపీలో చాలామందే ఉన్నారు. అయితే సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గుర్తింపు లేకపోవడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ నామినేటెడ్ పదవుల కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నా తమకు నిరాశే ఎదురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయి. కానీ తెలంగాణ నేతలకు మాత్రం పెద్దగా దక్కడంలేదని వాపోతున్నారు. గతంలో బండి సంజయ్(Bandi Sanjay) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పలువురు నేతలు ఈ అంశాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. తెలంగాణ ప్రాంత లీడర్లపై వివక్ష ఎంతకాలమని వారు తాజాగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినప్పుడు.. అదే స్థాయిలో తెలంగాణకు నామినేటెడ్ పోస్టులు ఇస్తే మరింత చురుకుగా పనిచేస్తామనే డిమాండ్ నేతల నుంచి వినిపిస్తోంది.
ఫోకస్ ఏదీ?...
తెలంగాణపై ఫోకస్ చేశామని చెబుతున్న బీజేపీ జాతీయ నాయకత్వం.. ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న నేతలను గుర్తించి వారికి పదువులు కట్టబెడితే సంతోషంతో ఇంకా దూకుడుగా పనిచేస్తామని వారు అంటున్నారు. కేంద్రంలో నామినేటెడ్ పదవులకు కొదవే ఉండదు. వాటికి తోడూ అదనంగా రాజ్యాంగబద్ధ పదవులూ ఉంటాయి. వాటిని పార్టీ కోసం పనిచేసే వారికి ఇస్తుంటారు. గతంలో తెలంగాణలోని నేతలకు కూడా కొన్ని పదవులు లభించాయి. అయితే కీలకమైన పదవులు దక్కలేదనే అసంతృప్తి ఉంది.
తెలంగాణకు రావాల్సిన స్థాయిలో దక్కలేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. గతంలో ఇచ్చిన పదవులు కాకుండా.. ఈ మధ్య పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తమకు వచ్చిన పదవులు ఏవని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నా.. తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పోరాడుతున్నా గుర్తింపు దక్కడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి.
పైగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషనతోపాటు పలు మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలోనే జరగనుననాయి. ఈలోపే రాష్ట్ర నాయకత్వం మేల్కొని తెలంగాణ ప్రాంత నేతలకు వీలైనన్ని ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తే ఉత్సాహంగా పనిచేయడంతో పాటు అధికార పార్టీని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వారికి వస్తుందని పార్టీవర్గాల్లో చర్చ జరగుతోంది. నిజానికి, తెలంగాణ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకత్వానికి ఆశావహుల పేర్లను పంపించినా, ఢిల్లీ నుంచి స్పందన రాలేదని తెలిసింది.
తెలంగాణపై ఫోకస్ పెట్టామని చెబుతున్న పార్టీ పెద్దలు.. తెలంగాణకు నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. పదవులులేకపోవడంతో నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నారని, కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కొత్త ఇన్‌ఛార్జ్‌లు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నామినేటెడ్ పదవుల పండుగను మొదలుపెట్టాలని నేతలు కోరుతున్నారు. లేకుంటే పార్టీలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.