కరెంట్ కష్టాలు.. కర్షకుడికి కన్నీళ్లు!

13-10-2026 | 05:45am
  1. డిమాండ్ దూసుకెళ్తుంటే.. సరఫరాపై ఒత్తిడి
  2. బొగ్గు, హైడల్ ఉత్పత్తి, పెరిగిన వినియోగమే అసలు సవాలు
  3. ప్రభుత్వ చర్యల అమలుపై రైతుల్లో అనుమానాలు
  4. ప్రతిపక్ష ఆరోపణలకు క్షేత్రస్థాయిలో ఆధారాలు
  5. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కొరత

సిద్దిపేట, అక్టోబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్ డిమాండ్(Electricity demand) రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అధికంగా(High temperatures) ఉండటం, వ్యవసాయ అవసరాలు(Agricultural requirements) పెరగడం, గృహ, వాణిజ్య వినియోగం విస్తరించడం, ఎల్ నినో ప్రభావంతో(Impact of El Niño) వర్షపాతం లోటు వంటి పరిణామాలు విద్యుత్ సంస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ దాదాపు 20 వేల మెగావాట్లకు చేరడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. రోజురోజు కూ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడంతో సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగు తోంది.

బొగ్గు, హైడల్ ఉత్పత్తి, పెరిగిన వినియోగమే అసలు సవాలుగా మారుతోంది. ప్రభుత్వ చర్యలు మొదలైనా.. వాటి అమలుపై రైతుల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు క్షేత్రస్థాయిలో ఆధారాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కొరత, కోతలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది కరెంట్ కష్టాలు.. వర్షాల లేమి.. ఎల్ నినో షాక్‌తో కర్షకుడికి కన్నీళ్లు మిగిలేలా చేస్తున్నాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ 30న తెలంగాణలో గరిష్ఠ డిమాండ్ 19.9 మెగా వాట్లకు చేరింది.

సెప్టెంబర్ 28న 19,133 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పాటు 326.70 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని చెప్పడానికి మాత్రం ప్రస్తుత గణాంకాలు పూర్తి స్థాయిలో బలం ఇవ్వడం లేదు.

సెప్టెంబర్‌లో ఒక్క రోజే స్వల్పంగా డిమాండ్ పూర్తిగా తీరని పరిస్థితి నమోదైనట్లు ఎన్‌ఎల్ డీసీ ఆధారిత గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే సమస్య మొత్తం విద్యుత్ లేకపోవడమే కాదు. డిమాండ్ పెరిగిన సమయంలో అవసరమైన చోట, అవసరమైన నాణ్యతతో, నిరంతరంగా సరఫరా చేయగల పంపిణీ సామర్థ్యం కూడా లేకపోవడం కీలకంగా మారింది.

రైతు మోటారుకు కరెంట్ ఎప్పుడు?

వ్యవసాయ రంగంపై విద్యుత్ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఇప్పటికే భారీ స్థాయిలో పెరిగింది. టీజీఈఆర్‌సీ గణాంకాల ప్రకారం.. వ్యవసాయ వినియోగం పెరుగుతున్న కొద్దీ పంపిణీ వ్యవస్థపై కూడా అదనపు భారం పడు తోంది. బోర్లపై ఆధారపడే రైతులకు మూడు దశల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే నీటి పారుదల నిలిచిపోతుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పలు జిల్లాల్లో రైతులు సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేయడం, రాస్తారోకోలు నిర్వహించడం దీనికి నిదర్శనం.

కొన్ని ప్రాంతాల్లో రైతులు 9, 10 గంటలకే విద్యుత్ పరిమితమవుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవపూర్ సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ల్లో ఒక రోజు 10 గంటల 15 నిమిషాలు, నంగునూరు మండలంలోని నర్మేట సబ్ స్టేషన్‌లోని లాగ్‌బక్‌లో 8గంటలు సరఫరా నమోదైందని ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చూపించారు. అయితే ఒక సబ్‌స్టేషన్ గణాంకాన్ని రాష్ట్రవ్యాప్త సరఫరాకు ప్రమాణంగా పరిగణించడం కూడా సరైంది కాదు.

పంటలపై ప్రభావం ఎంత?

విద్యుత్ అంతరాయం వల్ల ప్రధానంగా బోర్లపై ఆధారపడిన వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, కూరగాయలు, ఉద్యాన పంటలు ప్రభావితమ య్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వరి పంటకు కీలక దశల్లో నీరు అందకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పత్తిలో పూత, కాయ దశల్లో తేమ లోపిస్తే దిగుబడి దెబ్బతినవచ్చు. కూరగాయలు, మిరప వంటి పంటల్లో నిరంతర నీటి అవసరం ఉండటంతో నష్టం వేగంగా కనిపించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతల వల్ల రైతులకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని కూడా చర్చ జరుగుతోంది. 

ఎల్ నినోతో మరో భారం

ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతలు, జలాశయాల్లో నీటి లభ్యత తగ్గడం వంటి సమస్యలు ఇప్పటికే వ్యవసాయాన్ని ఒత్తిడిలోకి నెట్టాయి. ప్రభుత్వం కూడా ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇలాంటి సమయంలో సాగునీటి కోసం రైతులు బోర్లపై మరింత ఆధారపడితే విద్యుత్ డిమాండ్ సహజంగానే పెరుగుతుంది.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను పూర్తి సామర్థ్యంతో నడపడం, సింగరేణి నుంచి రోజువారీ బొగ్గు సరఫరాను పెంచడం, అవసరమైన విద్యుత్‌ను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం, అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూడటం వంటి చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పంపులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కూడా స్పష్టం చేసింది.

అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఎదురవుతోంది. ఈ చర్యలు క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతున్నాయి? బొగ్గు కొరత, థర్మల్ ప్లాంట్ల నిర్వహణ, హైడల్ ఉత్పత్తి తగ్గడం, పెరుగుతున్న డిమాండ్, రాత్రి వేళల్లో సరఫరా ఒత్తిడి వంటి అంశాలను ముందుగానే అంచనా వేసి విద్యుత్ కొనుగోలు, నిల్వ, పంపిణీ ప్రణాళికను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.

ప్రతిపక్ష ఆరోపణల్లో ఎంత నిజం?

ప్రభుత్వం 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నదనే వాదనకు విరుద్ధంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు తక్కువ గంటల సరఫరాపై ఫిర్యాదులు చేయడం వాస్తవం. సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ల్లో రికార్డులు, రైతుల నిరసనలు దీనికి కొంత బలం ఇస్తున్నాయి. కానీ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కొరతే ఉందని, ప్రభుత్వం మొత్తం డిమాండ్‌ను తీర్చలేకపో తోందని చెప్పడానికి తాజా రాష్ట్రస్థాయి గణాంకాలు మాత్రం పూర్తిగా అనుకూలంగా లేవు.

అందువల్ల రాజకీయ ఆరోపణల కంటే ప్రతి ఫీడర్‌కు రోజువారీ సరఫరా గంటలు, లో వోల్టేజీ వివరాలు, ట్రిప్పింగ్ సమయం, వ్యవసాయ ఫీడర్ల వారీగా సరఫరా గణాంకాలను ప్రభుత్వం బహిరంగం చేయడం అత్యంత అవసరం. అప్పుడే కరెంట్ కష్టాలపై వాస్తవం, ఆరోపణ మధ్య ఉన్న తేడా స్పష్టమవుతుంది. కానీ రైతులు కోరేది ఒక్కటే.. కరెంట్ ఎన్ని గంటలు వస్తుందన్నది కాదు, వచ్చినప్పుడు నాణ్యమైన మూడు దశల విద్యుత్ నిరంతరంగా రావాలి. అదే పంటకు భరోసా.. రైతుకు జీవనాధారం.

మరిన్ని వార్తలు