ఏసీబీకి చిక్కిన అవినీతి తహసీల్దార్
- లేఔట్ అనుమతికి 30 లక్షలు డిమాండ్.. 20 కుదిరిన ఒప్పందం
- సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు అరెస్ట్
- అబ్దుల్లాపూర్‌మెట్ అధికారుల్లో గుబులు
హైదరాబాద్, అక్టోబర్ 12: ఇరవై లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు భారీ తిమింగళం చిక్కింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి(Tahsildar Sudarshan Reddy), సర్వేయర్ శ్రీనివాసులును(Surveyor Srinivasulu) ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో లేఔట్‌కు అనుమతుల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు.
తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడిని రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడ్డారు. చివరకు రూ. 20 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులకు ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశాడు.
అధికారుల ప్రణాళిక ప్రకారం బాధితుడు నడుచుకుంటూ అధికారులకు రూ. 20 లక్షల నగదును అందజేస్తుండగా ఏసీబీ బృందం మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకుంది. ఈ అధికారులకు సంబంధించిన ఆస్తులపై ఆరా తీస్తున్నారు. ఇరువురిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెడతామని ఏసీబీ అధికారులు చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ వీరిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకోవడంతో అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది.