నినదించిన ఇండీ
మార్చ్ ఫర్ డెమోక్రసీ..
దద్దరిల్లిన ఢిల్లీ
- సీఈసీ జ్ఞానేశ్‌పై ఫిర్యాదుకు సుప్రీంకోర్టు దాకా ర్యాలీ
- తరలివచ్చిన వేల మంది
- బ్యాట్స్‌మన్ మాస్క్‌లతో రాహుల్, ఖర్గే
- తెలంగాణ నుంచి సీఎం రేవంత్, మంత్రులు, నేతలు కూడా..!
- సుప్రీంలో 10 పార్టీల తరఫున 11 పిటిషన్లు.. నేడు విచారణ
- జ్ఞానేశ్‌ను తొలగించాలని, ‘సర్’ను ఆపేయాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఇండీ కూటమి(INDIA alliance) మహా ర్యాలీతో ఢిల్లీ వీధులు మరోసారి దద్దరిల్లాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామానే(CEC Gyanesh Kumar resigns) ఎజెండాగా ‘ఛలో ఢిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండీ కూటమి పార్టీలు ఒక్కటిగా ముందుకు కదిలాయి. కన్నాట్ ప్లేస్ - బారాఖంబా జంక్షన్ నుంచి సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ర్యాలీ సుప్రీంకోర్టు(Supreme Court) వరకు సాగింది. అడుగుడుగునా పోలీసులు మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని ఛేదించుకుంటూ నేతలు మార్చ్‌లో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.
‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’, ‘సేవ్ డెమోక్రసీ’ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. సుప్రీంకోర్టుకు(Supreme Court) చేరుకున్న తర్వాత ఇండీ కూటమి(INDIA alliance) నేతలు 11 పిటిషన్లు దాఖలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని, ఎన్నికల అవకతవకలపై విచారణ జరిపించాలని, ‘సర్’ ప్రక్రియను నిలిపివేయాలని, పేపర్ బ్యాలెట్‌ను పునరుద్ధరించాలని వాటిలో కోరారు. సుప్రీంకోర్టులో సీజేఐ సూర్యకాంత్‌ను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రం ఇస్తామని ముందస్తుగా ఇండీ కూటమి ప్రకటించినప్పటికీ.. ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ర్యాలీగా వెళ్లి పిటిషన్లు వేశారు.
బ్యాట్స్‌మన్ మాస్క్‌లతో నేతలు
ర్యాలీకి ముందు ఇండీ కూటమి నేతలు కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో సమావేశమయ్యారు. ఇందులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీ (శరద్ పవార్) పార్టీ నాయకురాలు సుప్రియా సూలే, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత బేబీ తదితరులు పాల్గొన్నారు. సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరించడంతో ఎలా ముందుకువెళ్లాలో చర్చించారు. కోర్టు సమయం ముగిసేలోపు వెళ్లి పిటిషన్లు వేయాలని నిర్ణయించారు.
కన్నాట్ ప్లేస్ బారాకంబా జంక్షన్ దగ్గరకు మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవాలని.. అక్కడి నుంచి ర్యాలీ మొదలవుతుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం నేతలంతా అక్కడికి బస్సులో చేరుకున్నారు. ఆ తర్వాత ర్యాలీ మొదలైంది. ఇందులో ఖర్గే, రాహుల్, ప్రియాంక, అఖిలేశ్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, సుప్రియా సూలే తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున ర్యాలీకి హాజరయ్యారు.
తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ యూత్ విభాగం ఎన్‌ఎస్‌యూఐ నేతలు ర్యాలీలో సూపర్ మ్యాన్ బ్యాట్స్‌మన్ మాస్క్‌లను పంపిణీ చేశారు. వాటిని రాహుల్, ఖర్గే కూడా ధరించి.. దేశాన్ని కాపాడుకునేందుకు వస్తున్నామంటూ సంకేతాలు ఇచ్చారు.
కోర్టుకు సమీపంలో ఉద్రిక్తత
ర్యాలీ సుప్రీంకోర్టుకు సమీపంలోని భగవాన్ దాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తోపులాట జరిగింది. కొందరు నేతలు బారికేడ్లు ఎక్కి నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ర్యాలీ నేపథ్యంలో కానిస్టిట్యూషనల్ క్లబ్, కన్నాట్ ప్లేస్, సుప్రీంకోర్టు పరిసరాల్లో ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించారు. కదలికలపై నిఘా పెట్టారు.
11 పిటిషన్లు దాఖలు.. నేడు విచారణ
ర్యాలీ అనంతరం సుప్రీంకోర్టులో పది పార్టీల తరఫున 11 పిటిషన్లను ఇండీ కూటమి నేతలు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. టీఎంసీ తరఫున ఎంపీ సౌగతా రాయ్, సమాజ్ వాదీ పార్టీ తరఫున ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పిటిషన్లు వేశారు. ఇక.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (శరద్ పవార్) నాయకురాలు సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐ నేత డి.రాజా, జేఎంఎం ఎంపీ మహువా మాఝీ, సీపీఎం నేత ఎంఏ బేబీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత మహమ్మద్ బషీర్ కూడా పిటిషన్లు వేశారు.
రాహుల్ సహా పలువురు నేతలు ర్యాలీలోనే ఆగిపోవడంతో, కోర్టు సమయం ముగుస్తుండటంతో వారి తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని, ఎన్నికల అవకతవకలపై విచారణ జరిపించాలని, ‘సర్’ ప్రక్రియను నిలిపివేయాలని, పేపర్ బ్యాలెట్‌ను పునరుద్ధరించాలని వంటి అభ్యర్థనలతో వీటిని వేశారు. పిటిషన్లు దాఖలైనట్లు సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. మంగళవారం ఇవి విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రాహుల్ పిటిషన్‌లో ఏముందంటే..!
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుదాఖలు చేసిన పిటిషన్‌లో రకాల అంశాలను లేవనెత్తారు. అవి: 1. సర్ రికార్డులన్నీ సమర్పించాలి, 2. సర్ నిర్ణయాల చట్టబద్ధతను పరిశీలించాలి. 3.ఓటర్ల జాబితాతయారీ, సవరణకు రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై ప్రజాప్రాతినిథ్యం చట్టం 1950లోని సెక్షన్ 32 కింద చర్యలు చేపట్టాలి. 4.సర్ ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలి.
5. ఆన్‌లైన్ ఫారం నిబంధనలు పాటించాలి. 6. ఓటర్ల పేర్ల తొలగింపు, మార్పులపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. 7. సర్‌లో తొలగించిన ఓటర్ల వివరాలు బయటపెట్టాలి. కారణాలు ఏమిటో వెల్లడించాలి. 8. చట్టప్రకారం నోటీసులు, విచారణ లేకుండా ఓటర్ల పేర్లు తొలగించొద్దు. 9. దేశవ్యాప్తంగా సర్‌ను నిలిపివేయాలి, 10.అర్హులైన పౌరుల ఓటు హక్కు ను కాపాడేందుకు ఆదేశాలు ఇవ్వాలి.
ఫీజు తక్కువ కట్టిన రాహుల్
రాహుల్ వేసిన పిటిషన్‌లో 14 రకాల లోపాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ఫీజును కూడా రూ. 220 తక్కువగా చెల్లించినట్లు పేర్కొంది. మరో తొమ్మిది మంది పిటిషనర్ల నుంచి సరైన పత్రాలు అందలేదని, ఖర్గే పిటిషన్‌లో ఐడీ కార్డు జిరాక్స్ అస్పష్టంగా ఉందని తెలిపింది.