ఓట్ చోరీకే సర్

13-10-2026 | 05:25am
  1. మోదీ, షా, జ్ఞానేశ్ కుట్ర 
  2. మైనారిటీ, దళిత, గిరిజనుల ఓట్ల తొలగింపునకు యత్నం 
  3. ‘సైమన్ గో బ్యాక్’ స్ఫూర్తితో ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ ఉద్యమం 
  4. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ నేతృత్వంలో పోరు
  5. సీఎం రేవంత్‌రెడ్డి 

అక్టోబర్ 12 (విజయక్రాంతి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రపూరితంగా ‘సర్’ ప్రక్రియతో('Sir' process) ఓట్ల గల్లంతుకు పాల్పడుతున్నదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) విమర్శించారు. ప్రజల ఓటు హక్కు పరిరక్షణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi), ఇండీ కూటమి(INDIA alliance) భాగస్వామ్య పక్షాల నాయకత్వంలో మరో స్వతంత్ర పోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఓటు బచావో.. దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు.

నాడు స్వాతంత్య్రం కోసం సైమన్ గో బ్యాక్’ ఉద్యమం సాగిందని, ఇప్పుడు ఓటు హక్కును కాపాడుకునేందుకు ‘జ్ఞానేశ్ గో బ్యాక్, సర్ గో బ్యాక్’ నినాదాలతో పోరాడాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను  ముందుపెట్టి, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు. లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నె హ్రూ వంటి నాయకుల త్యాగాలు, పోరాటా ల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింద ని పేర్కొన్నారు.

ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశ ప్రజలకు ఓటు అనే శక్తిమంతమైన ఆయుధాన్ని అందించిందని గుర్తు చేశారు. రాజరి క, కుటుంబ పాలనలకు ముగింపు పలికిన ఓటు హక్కు ప్రజల చేతిలో అధికారం పెట్టడంలో కీలక పాత్ర పోషించిందని సీఎం పేర్కొన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజల సమాన త్వానికి ఓటు హక్కు బాటలు వేసిందని స్పష్టం చేశారు.  

గతంలో ఓటు నమోదుకు ఎస్‌ఐఆర్..

1950లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనూ సర్ ప్రక్రియ జరిగిందని, ఓటు హక్కు లేని వారికి అవకాశం కల్పించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో ప్రజలు ఎక్కడ స్థిరపడ్డారు? ఏ ప్రాంతానికి వెళ్లారు? అనే వివరాల నమోదుకు నాడు ‘సర్’ దోహదడిందని పేర్కొన్నారు. తర్వాత ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్ కాలంలోనూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిగిందని గుర్తు చేశారు. అయితే, ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారిని చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవారని అన్నారు.

ఇప్పుడు మోదీ, అమిత్ షా పాలనలో మాత్రం ఉన్న ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీఎం మండిపడ్డారు. గతంలో ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉపయోగిస్తే,  వాటితో తమ అధికారానికి అడ్డుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమవుతోందనే ఉద్దేశంతో ఎస్‌ఐఆర్‌ను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ముందుపెట్టి మోదీ ప్రభుత్వం ఓట్ చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత దెబ్బతింటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని సీఎం వ్యాఖ్యానించారు.  

 పారదర్శకత కోసమే నాడు మార్పులు..

గతంలో ఎన్నికల సంఘం ఒక్క కమిషనర్ నేతృత్వంలోనే పనిచేసేదని, అయితే.. మరింత పారదర్శకత కోసమే నాడు ప్రధాని  పీవీ నరసింహారావు హయాంలో ముగ్గురు కమిషనర్ల విధానాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష నేత భాగస్వామ్యంతో సీఈసీ నియామక ప్రక్రియ సాగేదన్నారు. నేడు మోదీ ప్రభుత్వం 2023లో ఈ విధానాన్ని మార్చిందని పేర్కొన్నారు. నిర్ణయాలను తమకు అనుకూలంగా తీసుకునేందుకే ఈ మార్పులు చేశారని సీఎం మండిపడ్డారు. జ్ఞానేశ్ కుమార్ నియామకం సమయంలోనే రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.  

దళితులు, గిరిజనులు, పేదల ఓట్లే లక్ష్యమా?

దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓటు హక్కును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ ఆరోపించారు.  సోషల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని లక్ష్యంగా చేసుకుని వారి ఓటును తొలగించే యోచనలో కేంద్రం ఉందని సీఎం విమర్శించారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రజల దృష్టికి తీసుకొచ్చింది రాహుల్‌గాందేనని పేర్కొన్నారు. మొదట్లో ఎవరూ పట్టించుకోకున్నా.. నేడు అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని వెల్లడించారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి వంటి వారు ఈ అంశంపై గొంతెత్తడమే ఇందుకు సంకేతమని పేర్కొన్నారు.

మోదీ, అమిత్ షా మౌనమెందుకో?

జ్ఞానేశ్ కుమార్ నియామకంలో ఎలాంటి కుట్ర లేదని మోదీ, అమిత్ షా భావిస్తే, ఆయనను తొలగించాలనే డిమాండ్‌పై ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సీఈసీకి ఎందుకు అండగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. జ్ఞానేశ్‌కుమార్ చర్యల వల్ల లబ్ధి పొందుతున్నది బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో మార్పులేననే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. సర్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు.

జనాభా పెరుగుతుంటే ఓట్లు తగ్గుతాయా?

2014లో మోదీ తొలిసారి పార్లమెంట్‌కు పోటీ చేసిన సమయంలో దేశంలో సుమారు 81 కోట్ల ఓటర్లు ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2019లో ఆ సంఖ్య 91 కోట్లకు, 2024 నాటికి సుమారు 97 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2026లో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని, దాన్ని 20కోట్లకు పెంచే కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు. 2014లో దేశ జనాభా ఎంత? ప్రస్తుతం ఎంత? అనే వివరాలను పరిశీలించాలన్నారు. జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణమేంటో ఈసే సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు స్పందించాలని కోరారు.  

 ఓటు ఉన్నవారు.. లేనివారంటూ రెండు వర్గాలా.. ?

దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారనే రెండు వర్గాలను సృష్టించే పరిస్థితి ఏర్పడుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను శ్రీమంతులు, పేదలు అనే వర్గాలుగా విడదీసి, పేదల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. సంపన్నులు బీజేపీకి మద్దతుగా ఉంటారని, పేదలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారనే రాజకీయ లెక్కలతో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, ఈ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  

రాహుల్ నాయకత్వంలో పోరాటం..

ఆనాడు సైమన్ గో బ్యాక్ నినాదం స్వాతంత్య్ర పోరాటానికి కొత్త ఊపునిచ్చిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణ సమరం జరుగుతున్నదన్నారు. గాంధీ కుటుంబం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందని, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీ ఓటు హక్కు కాపాడేందుకు పోరాడుతున్నారని తెలిపారు.  అందులో భాగంగానే తాము ఢిల్లీకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఈ పోరాటాన్ని మరో స్వాతంత్య్ర ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 

గతంలో పేదలకు ఓటు వద్దన్న ఆర్‌ఎస్‌ఎస్ 

పేదలు, దళితులు, గిరిజనులకు ఓటు హక్కు ఉండకూడదనే అభిప్రాయాలను బీజేపీ, దాని సైద్ధాంతిక గురువైన ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు గతంలో వ్యక్తం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని, అప్పటివరకు కాంగ్రెస్, ఇండీ కూటమి పోరాటం ఆగదని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు సచిన్ సావంత్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు