లక్ష్మీభాస్కర్ ‘ఉద్యోగ లీలలు’!

23-10-2026 | 05:35am
  1. నిమ్స్‌లో ఒకే కుటుంబంలో ఏడుగురికి పర్మినెంట్ కొలువులు!
  2. ఏసీబీ దర్యాప్తులో విస్తుబోయే నిజాలు 
  3. విజిలెన్స్ విచారణ ముమ్మరం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమైన ప్రస్తుత రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital)లో జరిగిన ఈ బాగోతం తాజాగా దర్యాప్తులో వెలుగుచూసింది. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అదుపులో ఉన్న నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ దర్యాప్తులో విస్తుబోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఒకే కుటుంబంలో ఏడుగురికి ఉద్యోగాలు?

లక్ష్మీభాస్కర్ తన పదవిని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ నియామకాలకు సంబంధించి కీలక సమాచారం లభించింది. నిమ్స్‌లో సాధారణ అటెండర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తేలింది. అటెండర్‌తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవడు.. ఇలా ఒకే కుటుంబంలోని ఏడుగురికీ పర్మినెంట్ ఉద్యోగాలు దక్కడం గమనార్హం. లక్ష్మీభాస్కర్, ఆయన గ్యాంగ్ కనుసన్నల్లోనే ఈ నియామకాలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

లోతుగా విజిలెన్స్ విచారణ..

లక్ష్మీభాస్కర్ బినామీల గుట్టురట్టు కావడంతో పాటు ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వ హయాంలో (2014 2023) నిమ్స్‌లో జరిగిన అక్రమాలు, కొనుగోళ్లు, ఆర్థిక అవకతవకలపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని సీఎంఓ ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు. ప్రధానంగా లక్ష్మీభాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన స్కిల్డ్, సెమీ స్కిల్ ఉద్యోగుల నియామకాల్లో లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. నిమ్స్‌లో కీలకమైన మూడు విభాగాల కొనుగోళ్లపై కూడా విజిలెన్స్ దృష్టి సారించింది.

మళ్లీ కస్టడీకి ఏసీబీ యోచన

ఇదిలా ఉండగా, ఈనెల 13 నుంచి 15 వరకు లక్ష్మీభాస్కర్‌ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ, ఆయన నుంచి తొలుత సహాయ నిరాకరణ ఎదురైంది. అయినప్పటికీ, తమదైన శైలిలో విచారించి బినామీల వివరాలను కొంతవరకు రాబట్టగలిగారు. అయితే, నిమ్స్ మాజీ ఉన్నతాధికారి మరియు మాజీ సలహాదారుతో లక్ష్మీభాస్కర్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలను మరింత పక్కాగా నిరూపించేందుకు ఆయన్ను మరోసారి కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కోర్టులో దాదాపు వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏసీబీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తు ఒకేసారి ముమ్మరం కావడంతో నిమ్స్‌లోని అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది.

మరిన్ని వార్తలు