నరక కూపం

23-10-2026 | 05:55am
  1. ప్రజల ప్రాణాలకు గుదిబండ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు
  2. గాలి పీల్చలేం.. నీరు తాగలేం!
  3. భూగర్భ జలాలు విషతుల్యం, గాలి కలుషితం
  4. రోజుకు 7వేల టన్నుల చెత్త.. మీథేన్‌తో ముప్పు
  5. 30 కి. మీ. పరిధి వరకు దుర్భర పరిస్థితులు
  6. ప్రపంచంలోని 25 ప్రధాన చెత్త కేంద్రాల్లో దీనికి నాలుగో స్థానం
  7. ముస్కు హనుమంతరెడ్డి

మేడ్చల్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ‘ఒక వైపు చెత్తగుట్టలు.. మరోవైపు కలుషిత గాలి, విషతుల్యమవుతున్న భూగర్భజలాలు.. వెరసి జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు బతుకు భారంగా మారింది. నగరం నలుమూలల నుంచి తరలిస్తున్న చెత్త.. గుట్టలుగా పేరుకుపోతుండగా, వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్యం స్థానికుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. డంపింగ్ యార్డు(Dumping Yard) నుంచి వెలువడే కాలుష్యం సుమారు 30 కిలో మీటర్ల పరిధి వరకు ప్రభావం చూపుతోంది.

గాలి కలుషితం, చెత్త నుంచి వర్షపు నీటితో కలిసి వెలువడే విషపూరిత ద్రవాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీరు కరువైంది. రోజుకు సుమారు 7వేల టన్నుల చెత్తను ఇక్కడికి తరలిస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. కుళ్లిన వ్యర్థాల నుంచి మీథేన్ వాయువులు వెలువడుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. 

డంపింగ్ యార్డును తరలించాలని ఏళ్లు గా వేడుకుంటున్నా పాలకుల నుంచి స్పంద న లేదని స్థానికులు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్న విమర్శలు న్నాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీ సర్వే ప్రకారం ప్రపంచంలోని 18 దేశాలకు చెంది న 25 ప్రధాన చెత్త నిర్వహణ కేంద్రాల్లో జవహర్‌నగర్ యార్డు నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్ మొదటి స్థానంలో, ఇండోనేషియా దేశ రాజధాని జకార్తా రెండో స్థానంలో, మలేషియాలోని కౌలాలంపూర్ మూడో స్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 

నగరం చెత్తంతా జవహర్‌నగర్‌కే..

1990లో 339 ఎకరాల్లో జవహర్‌నగర్‌లో చిన్న డంపింగ్ యార్డ్ ప్రారంభించారు. అప్పట్లో ఈ ప్రాంతానికి చెందిన చెత్త మాత్రమే ఇక్కడికి తరలించేవారు. కాలక్రమేణా హైదరాబాద్ నగరం చెత్తంతా జవ హర్‌నగర్ తరలిస్తున్నారు. కోటి 60 లక్షల జనాభాకు చెందిన చెత్తను ఇక్కడికి తీసుకువస్తున్నారు. రోజు సుమారు 7 వేల టన్నుల చెత్త డంప్ చేస్తున్నారు. కుళ్లిన చెత్త నుంచి సుమారు 6 టన్నుల మీథేన్ గ్యాస్ వెలువడుతున్నట్లు పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి.

వర్షపు నీరు చెత్తలోకి ఇంకి విషపూరిత ‘లీచెట్’ తయారవుతుంది. ఇది  భూ గర్భంలో 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో బోర్లలో నీరు కలుషితమవుతోంది. ఈ నీటి వాడకంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. నగరం లో వివిధ ప్రాంతాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. డంపింగ్ యార్డుకు రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఉండడంతో స్థానికులకు శాపంగా తయారైంది. 

రాంకీ సంస్థ నిర్లక్ష్యం!

డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న రామ్‌కీ సంస్థ  నిర్లక్ష్యం చేస్తోంది. కాలుష్యం నియంత్రించాల్సి ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జవహర్ నగర్‌లోని కార్మికనగర్, ఆర్మీ దంత కళాశాల, శ్రీరాంనగర్, గబ్బిలాలపేట్, రాజీవ్‌గాంధీ నగర్, ప్రగతినగర్, అంబేద్కర్‌నగర్, ద్మగూడ, చేర్యాల, బండ్లగూడ, అహ్మద్ గూడ, రాంపల్లి, నాగారం, డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్, హరిదాసుపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాలు కాలుష్యం కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దూర ప్రాంతాలకు కూడా కాలుష్య సమస్య విస్తరిస్తోంది.

డంపింగ్ యార్డ్ వల్ల ప్రాణాలు హరించుకుపోతున్నాయని, ఇక్కడి నుంచి ఎత్తివేయాలని ఎంతో కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. గతంలో ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సీఎం రేవంత్‌రెడ్డి కూడా డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా గళమెత్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లయినా ఎక్కడ సమస్య అక్కడే ఉంది. స్థానికులు జేఏసీగా ఏర్పడి చాలాకాలంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ పాలకుల నుంచి కనీసం స్పందన లేదు. 

ఎంపీ ఈటల రాజేందర్ పోరుబాట..

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేయాలనే డిమాండ్‌తో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (నేడు) జవహర్‌నగర్‌లో బాధితులతో, 25న మేధావులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరి అభిప్రాయాల మేరకు ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు