విచ్చలవిడిగా నీటి దందా!
- అపార్ట్మెంట్లు, కంపెనీలకు అక్రమంగా నీటి సరఫరా
- గ్రామాల్లో నీటి కొరతపై ఆందోళన
- అధికారులు స్పందించాలని ప్రజల డిమాండ్
పటాన్ చెరు, అక్టోబర్ 22: ఒకవైపు ఎల్ నినో హెచ్చరికలు, మరోవైపు నీటిని తోడేస్తు న్న అక్రమార్కులు.. పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు(Patancheru) పరిసర ప్రాంతాల్లో నీటి వినియోగంపై అనే క ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలు గ్రామాల్లో భూగర్భ జలాలను భారీగా తోడుతూ అపార్ట్మెంట్లు, పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భూగర్భ జలాల పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుక్కెడు నీటికోసం పలు డివిజన్లలో నానా తంటాలు పడుతుంటే ఇదే అదనుగా కొందరు అక్రమా ర్కులు నీటి దందాపై ఫోకస్ పెట్టారు. అనుమతి లేకుండానే ట్యాంకర్ల ద్వారా కాలనీవాసుల ప్రయోజనాల కోసం కాకుండా కాసులకు కక్కుర్తిపడి పరిశ్రమలకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. కాలనీలలో నీటి ట్యాంకర్ కోసం అడిగితే వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా డబ్బులు ఎక్కువ ఇచ్చిన అపార్టుమెంట్లకు సరఫరా చేస్తున్నారని పలు కాలనీవాసులు వాపోతున్నారు.
పలు మండలాల్లో నీటి దందా?
జిన్నారంలోని కిష్టయ్యపల్లి, కాజిపల్లి, గడ్డపోతారం, బొల్లారం, నల్తూర్ గ్రామాలతో పాటు పటాన్చెరు పరిధిలోని ఇస్నాపూర్, చిట్కుల్, లక్డారం, నందిగామ ప్రాంతాల్లో నీటి సరఫరాపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రామచంద్రాపురం పరిధిలోని తెల్లాపూర్, కొల్లూరు, అమీన్పూర్ పరిధిలోని బొమ్మలకుంట, సుల్తాన్పూర్, దయారా, వడకపల్లి ప్రాంతాల్లోనూ నీటి వినియోగంపై అధికారులు దృష్టి సారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇక్కడి వ్యవసాయ బోర్ల నుండి నీటిని తక్కువ ధర చెల్లించి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా కొందరు సిండికేట్గా ఏర్పడి అనుమతులు లేకుండానే ఇష్టారీతిగా వ్యవసాయ పొలాల వద్ద బోర్లు తవ్వి నీటి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బోర్లు ఎండిపోయి రైతులు లబోదిబోమంటున్నారు.
వేల లీటర్ల నీరు.. ఎక్కడి నుంచి వస్తోంది?
కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా అపార్ట్మెంట్లు, కంపెనీలకు పెద్ద మొత్తంలో నీటిని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకు వేల లీటర్ల నీరు తరలిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ నీటిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? అవసరమైన అనుమతులు ఉన్నాయా? భూగర్భజలాల వినియోగానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నీటి దందాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.