‘నషా ముక్త్ భారత్’ లక్ష్యం!
- దత్తన్న ‘అలయ్ బలయ్’ సామాజిక నినాదం
- నాంపల్లి మైదానంలో రాజకీయ నేతల సందడి
- నోరూరించే 115 రకాల వంటలతో బంతి భోజనం
- సామాజిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిర్వహణ
- ‘అలయ్ బలయ్’ థీమ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ‘నషా ముక్త్ భారత్(Nasha Mukt Bharat)’ నినాదంతో చేపట్టిన ప్రతిష్టాత్మక ‘అలయ్.. బలయ్’ వేడుకలు వైభవంగా జరిగాయి. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) ఆధ్వర్యంలో ఆయన కుమార్తె విజయ లక్ష్మీఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఈ కార్య్రకమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ సాంస్కృతిక వైభవం, సామాజిక సమైక్యత ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి చేర్చే ఈ వేడుకలు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది.
యువతను వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరం చేయడమే లక్ష్యంగా ఈ ఏడాది ’నషా ముక్త్ భారత్’ నినాదంతో ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు.
ప్రకృతిని కాపాడుకోవాలి: వెంకయ్యనాయుడు
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మానవాళి ప్రకృతితో మమేకమై జీవనం సాగించకపోతే భవిష్యత్తులో విపత్తులు తప్పవని హెచ్చరించారు. మనుషుల మధ్య ఆప్యాయతలు, సోదరభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సెక్యులర్ దేశంలో ఏ మతాన్ని, ఏ పండుగను కూడా తక్కువ చేసి చూడొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ సాధనే మనందరి లక్ష్యం కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రే య ఆకాంక్షించారు. అలయ్ బలయ్ అనేది రాజకీయాలకు, ప్రాంతాలతీతమైన ఆత్మీయ వేదిక అని విజయలక్ష్మి పేర్కొన్నారు.
15 వేల మందికి ఆత్మీయ ఆతిథ్యం
అలయ్ బలయ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఘుమఘుమలాడే తెలంగాణ రుచులు. ఈసారి వేడుకల్లో భాగంగా అంచనాలకు తగ్గట్టుగానే 15 వేల మంది అతిథుల కోసం ప్రత్యేకంగా 115 రకాల వంటకాలను సిద్ధం చేశారు. మటన్, చికెన్ బిర్యానీలు, రొయ్యలు, చేపల పులుసులు, నవాబీ కిచెన్ వంటకాలు, అచ్చమైన తెలంగాణ రుచులు, వెజ్ అండ్ నాన్-వెజ్ కూరలు అతిథులకు అందించారు. ప్రతిఏటా దత్తన్న ఆప్యాయత ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఓబీసీ మోర్చా నేత రమేశ్ కొనియాడారు.
ఏపీలోనూ పెట్టు దత్తన్నా: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు (వీహెచ్) తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం నవ్వులు పూ యించాయి. ‘తెలంగాణలో మేం రాజకీయంగా కొట్టుకున్నా, తిట్టుకున్నా పండుగల కు కలుస్తాం. కానీ దత్తన్నా.. ఈ కల్చర్‌ను పక్క రాష్ట్రానికి కూడా తీసుకెళ్లు. కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు ప్రాంతా ల్లో అలయ్ బలయ్ పెట్టు. అక్కడ గొడవలు పెట్టుకుంటే ఎన్నేళ్లయినా కలవరు. పొడుచుకునే సంస్కృతి ఉంటుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
ప్రధాని మోదీ ప్రశంస
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంలో అలయ్ బలయ్ కృషి అభినందనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ‘అలయ్ బలయ్ దసరా సమ్మేళనం 2026’కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బండారు దత్తాత్రేయకు గురువారం రాసిన లేఖలో ప్రధాని కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రశంసించారు. విజయదశమి అనంతరం నిర్వహించే ఆలయ్ బలాయ్ వేడుకలు చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేస్తాయని పేర్కొన్నారు.
ఇలాంటి వేడుకలు ప్రజలను ఒకచోట చేర్చి, సమాజంలో ఆప్యాయత, సోదరభావజాలాన్ని మరింత బలో పేతం చేస్తాయని తెలిపారు. తెలంగాణ జానపద కళాకారుల ప్రతిభకు మంచి వేదిక అని పేర్కొన్నారు. సంప్రదాయ వంటకాలు, సంగీతం, నృత్యం, ఇతర కళారూపాల ద్వారా తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంవత్సరాలుగా ఈ సంప్రదా యాన్ని కొనసాగిస్లున్న నిర్వాహకులను అభినందించారు. ఈ ఏడాది ‘నషా ముక్త్ భారత్ వికసిత్ భారత్ 2047’ అనే థీమ్‌తో నిర్వహించడంపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలయ్ బలయ్ నిర్వహిస్తున్న బం డారు దత్తాత్రేయతో పాటు ఈ కార్యక్రమం తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అలయ్ బలయ్
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
మాజీ గవర్నర్ దత్తాత్రేయను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే
ఇందూరు, అక్టోబర్ 22(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అలయ్ బలయ్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దసరా సమ్మేళనంలో భాగంగా అలయ్ బలయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణంలో కార్యక్రమం నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా అలయ్ బలయ్ నిర్వహించడం కేవలం దత్తాత్రేయకే సాధ్యమైందన్నారు. వారి సంప్రదాయాన్ని కూతురు కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్కృతిని మరిచిపోకుండా ముందుకు తీసుకెళ్లడం గొప్ప పరిణామమన్నారు.