ఎల్ నినోపై తగిన కార్యాచరణ

23-10-2026 | 05:10am

ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కనిపించిన తర్వాత స్పందించడం కంటే ముప్పు ఉందని తెలిసినప్పుడే సిద్ధం కావడం సమర్థవంతమైన పాలనకు గీటురాయి. ఎల్ నినో(El Nino), వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు ఎదురవుతున్న సవాల్ ఇదే. సాగునీరు, తాగునీరు, విద్యు త్ కొరత ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. చెరువులు, రిజర్వాయర్లు, భూగర్భజలాలపై ఆధారపడిన గ్రామీణ ప్రాం తాల్లో వీటి ప్రభావం రైతు పొలం నుంచి ప్రజల తాగునీటి అవసరాల వరకు విస్తరించవచ్చు. అందుకే అందుబాటులో ఉన్న నీటిని ఎలా వినియోగించాలి, పంటలను ఎలా కాపాడాలి, నష్టపోయిన కుటుంబాలకు ఎలా అండగా నిలవాలి అనే అంశాలపై కార్యాచరణ అవసరం.

హెచ్చరికే కార్యాచరణగా మారాలి..

ఈ నెల 10న ఎల్ నినో పరిస్థితులపై సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించింది. 15న విడుదలైన అధికారిక ప్రకటనలోనూ నీటి ఎద్దడి, రైతుల ఇబ్బందులు, భూమిలేని వ్యవసాయ కూలీల ఉపాధి అంశాలు ప్రస్తావిం చబడ్డాయి. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం గత ఏడాది ఇదే సమయంలో రిజర్వాయర్లలో 462 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 200 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఈ గణాంకాలను తాజా జలాశయాల నివేదికలతో నిరంతరం సరిపోల్చి ప్రజలకు వెల్లడించాలి. 

నీటి నిల్వల నిర్వహణే ప్రధానం..

రిజర్వాయర్లలోని నీటిని తాగు, సాగునీరు తదితర అవసరాలకు ప్రణాళికాబ ద్ధంగా కేటాయించాలి. తాగునీటికి ప్రాధా న్యం ఇస్తూనే, కోతకు వచ్చే దశలో పంట లు నీటి కొరతతో దెబ్బతినకుండా వ్యూహాత్యక నిర్ణయాలు తీసుకోవాలి. ఏ జలాశ యంలో ఎంత నీరు ఉంది? ఎంత నీటిని తాగునీటికి కేటాయించాలి? పంటలకు ఎంత నీరు అవసరం? ఈ వివరాలతో కూ డిన బహిరంగ ప్రణాళికలు ప్రజలకు అం దుబాటులో ఉండాలి. చెరువులు, కుంటల పునరుద్ధరణ, పూడికతీత, కాలువల మరమ్మతులు, వర్షపు నీటి నిల్వ వంటి పనుల ను నిరంతర కార్యక్రమాలుగా చేపట్టాలి. గ్రామ పంచాయతీలు, రైతు సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలను భాగస్వాములుగా చేసి ప్రతి గ్రామానికి నీటి భద్రత ప్రణాళిక రూపొందించాలి.

రైతులకు భరోసా కల్పించాలి

నీటి లభ్యతను బట్టి పంటలు ఎంచుకోవాలని రైతులకు సూచించడం అవసరమే. అయితే ఏ పంట వేయాలి, ప్రత్యామ్నాయ పంటకు విత్తనాలు, మార్కెట్ సదుపాయాలు ఉన్నాయా అనే విషయాల్లో వ్యవ సాయ శాఖ ముందుగానే స్పష్టమైన సలహాలు ఇవ్వాలి. ప్రాంతాలవారీగా నీటి లభ్యతను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికే సాగులో ఉన్న పంట లకు అవసరమైన నీరు, విద్యుత్ అందించాలి. సరఫరా సమయాలు, కరెంట్ కోత లపై ముందస్తు సమాచారం రైతులకు అం దాలి. పంట మార్పు సూచించే సందర్భా ల్లో రైతుకు కలిగే ఆదాయ నష్టాన్ని ఎలా తగ్గిస్తారో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వివరించాలి.

భూగర్భ జలాలు.. సంక్షోభం!

బోర్లు ఎండిపోతే సాగుతోపాటు తాగునీరు, పశువుల సంరక్షణ, రైతుల ఆదా యంపైనా ప్రభావం పడుతుంది. విద్యుత్ సరఫరా పెంచడం ఒక్కటే పరిష్కారం కాదు. వర్షపు నీటి సంరక్షణ, చెక్డ్యామ్లు, ఇంకుడు గుంతలు, చెరువుల పునరుద్ధరణ, నీటి పొదుపు పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. భూగర్భజలాల స్థాయిని గ్రామాలవారీగా పర్యవేక్షించి, పరిస్థితిని బట్టి శాస్త్రీ య సలహాలు అందించాలి. సాగులో ఉన్న పంటలకు అవసరమైన విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలి. సరఫరా సమయాలు, కోతలపై ముందస్తు సమాచారం రైతులకు అందాలి. పంపుసెట్ల సమస్యల పరిష్కారానికి వేగవంత మైన వ్యవస్థ అవసరం.

రైతు కూలీలనూ ఆదుకోవాలి

వర్షాభావంతో రైతు పంట నష్టపోతే వ్యవసాయ కూలీకి కూడా పని తగ్గుతుంది. భూమిలేని కార్మికులకు పంట బీమా లేదా రైతుల కోసం ఉద్దేశించిన సాయం నేరుగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే ఉపాధి హామీ పనులను చెరువుల మరమ్మతులు, నీటి సంరక్షణ, గ్రామీ ణ ఆస్తుల అభివృద్ధితో అనుసంధానించాలి. పని అవసరమైన వారికి సమయా నికి పని, వేతనం అందాలి. పంట నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి పరిహారం అందించాలి. పశువులకు మేత, తాగునీరు, గ్రామీణ కుటుంబా లకు సురక్షిత నీటి సరఫరా కూడా ప్రణాళికలో భాగం కావాలి.

ముందుగానే సిద్ధం కావాలి

మండలాలవారీగా నీటి నిల్వలు, వర్షపాతం, భూగర్భజలాల స్థితి, పంటల పరి స్థితి, విద్యుత్ సరఫరా, ఉపాధి పనుల వివరాలను క్రమం తప్పకుండా వెల్లడించాలి. శాఖల మధ్య సమన్వయం, గ్రామస్థాయి లో సమాచార వ్యవస్థ బలంగా ఉంటే సమస్యను ముందుగానే గుర్తించి నష్టాన్ని తగ్గించవచ్చు. ఎల్ నినోను నియంత్రించడం మన చేతుల్లో లేకపోవచ్చు. కానీ నీటిని పొదుపుగా వాడడం, నష్టాన్ని తగ్గించడం, ఉపాధి కల్పించడం సాధ్యమే.

వర్షం పడాలని కోరుకోవడం సహజం. కానీ వర్షం తగ్గితే ఏమి చేయాలన్న ప్రణాళిక ముందే సిద్ధంగా ఉండాలి. ప్రజలకు కావాల్సింది హెచ్చరిక మాత్రమే కాదు. సమయానికి అందే నీరు, నిలిచే పంట, భరోసానిచ్చే ఉపాధి, నష్టాన్ని తగ్గించే సహాయం. నీరు, విద్యుత్, వ్యవసాయం, గ్రామీణ ఉపాధిని ఒకే దృష్టితో నిర్వహించినప్పుడే ఎల్నినో ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. 

 సెల్: 9849042083

యరకల శాంతి కుమార్

మరిన్ని వార్తలు