ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి

23-10-2026 | 05:40am
  1. కరువు మండలాలను ప్రకటించాలి
  2. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే: మాజీ మంత్రి హరీశ్

గజ్వేల్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు(Former Minister Harish Rao) మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ‘కృత్రిమ కరువు’ అని హరీశ్ ధ్వజమెత్తారు.

వానాకాలం సీజన్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి, అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కరువు మండలాలను ప్రకటించి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామ పరిధిలో  సాగు నీరు, విద్యుత్ అందక ఎండిపోయిన వరి పొలాలను హరీశ్‌రావు పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నాడు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. నేడు రాష్ర్టంలో పంటలు ఎండిపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మొద్దునిద్ర పోతున్నారు’ అని విమర్శించారు. ఎల్ నినోపై శాస్త్రవేత్తలు పది నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైనదని ఆరోపించారు. కనీసం బొగ్గు నిల్వలు సమకూర్చుకోకుండా, విద్యుత్ కొనుగోళ్లు చేయకుండా నిర్లక్ష్యం వహించి..  ఇప్పుడు అధికారులను మందలించడం సరికాదన్నారు.  సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదని.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సీఎం, విద్యుత్ శాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు.

రైతుల కన్నీటికి బాధ్యులెవరు?

బూరుగుపల్లిలో రైతులు జనరేటర్లు అద్దెకు తెచ్చుకున్నా ఫలితం లేకుండా పోతోందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు అరవింద్‌రెడ్డి ౩ ఎకరాల పంటను కాపాడుకునేందు కు మూడు రోజుల్లో రూ.21 వేలు ఖర్చు చేసి నా రెండున్నర ఎకరాలు ఎండిపోయాని తెలిపారు. మరో రైతు స్వామి మూడు ఎకరాల్లో రెండు ఎకరాల 30 గుంటల పొలం ఎండిపోయిందని, దయ్యాల యాదగిరి పది ఎకరాల్లో తొమ్మిది ఎకరాలకు పైగా పంట నష్టపోయారని పేర్కొన్నారు. లో-వోల్టేజీ, టూ ఫేజ్ విద్యుత్ సరఫరాతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి రైతులు మరింత నష్టపోతున్నారని, రైతుల కన్నీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం పంపులు బంద్

కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ఆన్ చేయడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌లోకి నీటిని ఎత్తిపోయడం లేదని ధ్వజమెత్తారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల మోటార్లను సైతం  నడపకుండా సాగునీటి కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మరో 20 రోజు ల్లో కోతకు రావాల్సిన పంటలు  ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేసి, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తే మిగిలిన పంటలనైనా కాపాడుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్నా ఇప్పటి వరకు కరువు మండలాలను అధికారికంగా ప్రకటించడకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.కరువులో వ్యవసా య కూలీలను ఆదుకునేందుకు రూ.12 వేలు అందించాలని, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.

కరువు వేళ ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడం, ఆర్టీసీ చార్జీలు పెంచడం దుర్మార్గమని హరీశ్‌రావు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  విద్యుత్ చార్జీల భారాన్ని, పెంచిన బస్సు చార్జీలను ఉపసంహరించుకుని నిత్యావసర ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిెట్టి చందన రవీందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు