నంబర్లు కనిపిస్తలేవు!

23-10-2026 | 05:20am
  1. వాహనాల నంబర్ ప్లేట్లలో నాణ్యతలోపం
  2. ‘హై’ సెక్యూరిటీ ప్లేట్లలో ‘లో’ క్వాలిటీనా? 
  3. కొద్దిరోజులకే వెలిసిపోతున్న నల్లటి అక్షరాలు
  4. వాహనాల గుర్తింపునకు విఘాతం 
  5. రాష్ట్రంలో 1.73 కోట్లకు పైగా వాహనాలు
  6. నంబర్ ప్లేట్ల నాణ్యతపై తనిఖీలేవీ?
  7. (బండి సంపత్ కుమార్)

మహబూబాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): వాహనాలకు భద్రత.. నేరాల నియంత్రణ.. ట్రాఫిక్ ఉల్లంఘనల గుర్తింపు లక్ష్యంగా ప్రవేశపెట్టిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్(నంబర్) ప్లేట్ల (high-security registration plates) నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్లేట్లు అమర్చిన కొద్దిరోజులకే నల్లటి అక్షరాలు వెలిసిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ నంబర్లు స్పష్టంగా కనిపించడం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించాల్సిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లే ఇలా మారితే వాహనాల గుర్తింపు ఎలా? నాణ్యతను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది? అనే సందే హాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల నం బర్లు సక్రమంగా కనిపించకపోవడం, కొన్ని ఇరువైపులా విరిగిపోవడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో వాహనాన్ని గుర్తించే పరిస్థితి లేదని చెబుతున్నారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా వాహనాల నంబర్లను చెరిపే స్తు న్నారని, ఇంకొందరు మార్ఫింగ్ చేస్తున్నారని, కొన్ని నాణ్యత లోపంతో దెబ్బ తింటు న్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

1.73 కోట్ల వాహనాలు.. నంబర్ ప్లేట్లే కీలకం!

తెలంగాణ రవాణా శాఖ గణాంకాల ప్రకారం 2025 మార్చి 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 1,73,64,507 వాహనాలు నమోదయ్యాయి. వీటిలో 1.27 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, సుమారు 23.47 లక్షల కార్లు ఉన్నాయి. ఇంత వాహన సమూహంలో ప్రతి వాహనాన్ని స్పష్టంగా గుర్తించేందుకు నంబర్ ప్లేట్ల నాణ్యత, అక్షరాల స్పష్టత అత్యంత కీలకం కాగా, వేల సంఖ్యలో వాహనాల నంబర్ ప్లేట్లలో సక్రమంగా నంబర్లు కనిపించకుండా తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భద్రతా ప్లేట్లలో నాణ్యతా లోపాలా?

నంబర్ ప్లేట్లపై అక్షరాలు చెరిగిపోవడం వల్ల సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) వ్యవస్థల ద్వారా వాహనాలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్ల జారీ, ప్రమాదాలకు కారణమైన వాహనాల గుర్తింపు, నేరాల దర్యాప్తులోనూ నంబర్ ప్లేట్ల స్పష్టతకు ప్రాధాన్యం ఉంది.

అయితే అక్షరాలు వెలిసిపోవడానికి నాణ్యతా లోపాలే కారణమా, లేక ఇతర పరిస్థితుల ప్రభావమా అన్నది సంబంధిత అధికారులు పరీక్షించి నిర్ధారించాల్సి ఉంది. రేడియం స్టిక్కర్లతో రూపొందించిన నంబర్ ప్లేట్లు ఏళ్ల తరబడి వినియోగిస్తున్నా ఇప్పటివరకు చెక్కుచెదరకుండా ఉంటుండగా, నాణ్యతతో కూడిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో నంబర్లు కొ ద్దిరోజులకే కనిపించకుండా పోవడం విమర్శలకు తావిస్తోంది.

నిబంధనలు స్పష్టమే.. అమలెంత?

రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాల ముందు, వెనుక రిజిస్ట్రేషన్ నంబర్లు స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలి. హెచ్‌ఎస్‌ఆర్పీ ప్రమాణాల్లో భాగంగా అక్షరాలు, అంకెలపై హాట్ స్టాంపింగ్, భద్రతా హోలోగ్రామ్, లేజర్ గుర్తింపు సంఖ్య వంటి అంశాలు నిర్దేశించారు. మరోవైపు నంబర్ ప్లేట్లపై అక్షరాలు చెరిగిపోయినా, వంగిపోయినా, ఉద్దేశపూర్వకంగా మార్చినా వాహన గుర్తింపు దెబ్బతింటుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకునే అధికారులు.. నంబర్ ప్లేట్ల నాణ్యత విషయంలోనూ అదే స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

బాధ్యత ఎవరిది?

హెచ్‌ఎస్‌ఆర్పీలను సరఫరా చేసే సంస్థలు, అమర్చే కేంద్రాలు, సంబంధిత రవాణా అధికారులు నాణ్యతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొద్దికాలంలోనే అక్షరాలు చెరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై నమూనాలను సేకరించి పరీక్షించాలి. లోపాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత వాహనదారులకు నిబంధనల ప్రకారం పరిష్కారం కల్పించాలి. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు గుర్తుచేయడమే కాకుండా, వాటి అమలుకు అవసరమైన వ్యవస్థల నాణ్యతను కూడా అధికారులు నిర్ధారించాలి. ‘హై సెక్యూరిటీ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్లేట్లలో అక్షరాలే నిలవకపోతే.. ఆ భద్రతకు అర్థమేమిటి? అన్న ప్రశ్నకు రవాణా శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు