గుంపుస్వామ్యాన్ని ఓడిద్దాం
- కాంగ్రెస్, సీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమం
- నవంబర్ 1న హైదరాబాద్‌లో 10 వేల మందితో భారీ ర్యాలీ
- 3న కరీంనగర్లో మరో ర్యాలీ: బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్, ప్రతిపక్షాల నిరసనల తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణలో విస్తృతస్థాయి రాజకీయ ప్రచార ఉద్యమానికి బీజేపీ(BJP) సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌తో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న ఇతర పార్టీలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. విద్రోహులను తరిమికొడదాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 1న హైదరాబాద్‌లో 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనుండగా, నవంబర్ 3న కరీంనగర్లో మరో 10 వేల మందితో ర్యాలీ చేపట్టనుంది.
కరీంనగర్ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబా ద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(BJP State President Ramchander Rao) అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్‌పై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ, ఆ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా చేపట్ట నున్న ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రచారం చేయనుంది. హైదరాబాద్‌లో నిర్వహించే ర్యాలీతో ప్రారంభించి, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన కార్యక్ర మాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. గుంపు సామ్యాన్ని ఓడించండి అనే సందేశంతో ‘లోక్తంత్ర బచావో.. భీడ్ తంత్ర హటావో’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైందని, అధికార మార్పు లక్ష్యం గా ఆందోళనలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కంటే నెహ్రూ- కుటుంబం పట్ల కాంగ్రెస్‌కు గుడ్డి విధేయత ఎక్కువైందని విమర్శించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను ప్రజల ముందు ఉంచి, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణకు బీజేపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
దేశంలో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టడంతో పాటు, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యక ర్తలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో యువతను చైతన్యపరిచేందుకు కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. అన్నివర్గాల ప్రజలను కలుపు కొని ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల ద్వారా తమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్, కరీంనగర్‌లలో భారీ ర్యాలీలతో ప్రారంభించి, జిల్లా కేంద్రాలకు ఉద్యమాన్ని విస్తరించడం ద్వారా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలపై రాజకీయంగా ఒత్తిడి పెంచాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.