తలాపున గోదారి.. మనకు నీళ్లేవీ?

04-11-2026 | 05:20am

ఇది కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు

కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరాన్ని పడావు పెట్టారు

గోదావరి జలాలను పొలాలకు పారిస్తేనే మల్లావఝల సదాశివుడికి నిజమైన నివాళి: కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) నిర్లక్ష్యమే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. తలాపున గోదారి పారుతున్నా మన చేలు, చెలకలు ఎడారిగా మారుతున్నాయని ఆయన అన్నారు. ‘కేసీఆర్‌పై(KCR) అక్కసు తో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను(Kaleshwaram and Palamuru projects) పడావు పెట్టి రైతులకు(Farmers) సాగునీరు అందకుండా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది. ఇది కా లం తెచ్చిన కరువు కాదు.. పాలకులు తెచ్చిన కరువు. ఇదేదో నేను అక్కసుతోనో, కోపంతోనో చెప్తున్న మాట కాదు.

వాస్తవాలను ఆధారంగా చేసుకుని చెప్తున్న మాట’ అని పేర్కొన్నారు. మంగళవారం ప్రముఖ కవి మల్లావఝల సదాశివుడి స్మారక పురస్కార ప్రదానోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2024-25 సంవత్సరానికి చెమన్ సింగ్‌కు, 2025-26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌కు పురస్కారాలను అందజేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు తిరునగరి దేవకిదేవి, కవ్వంపల్లి స్వామిని ప్రత్యేకంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ ఏడాది ఏడున్నర నెలల్లో గోదావరిలోకి 750 టీఎంసీల నీళ్లు, కృష్ణా నదిలోకి 258 టీఎంసీల నీళ్లు వచ్చాయని, సుమారు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోయాయని తెలిపారు. ‘నీళ్లు ఎత్తండి.. రైతులను ఆదుకోండి.. అని మేం ప్రస్తుత పాలకులను కోరాం. కానీ, వాళ్లు మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా, ఇవాళ వాస్తవాలను బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 

కేసీఆర్ ఉద్యమ పాట కూడా రాశారు

‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి. గోదావరిఖని మట్టిలోనే ఏదో మహత్యం ఉంది. కన్నీటి చుక్కల నుంచే కత్తులు మొలిపించిన అద్భుత కవి మల్లావఝల సదాశివుడు’ అని కేటీఆర్ కొనియాడారు. జలసాధన ఉద్యమ సమయంలో సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి’ పాట ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు కేసీఆర్ స్వయంగా పాట కూడా రాశారని కేటీఆర్ ప్రస్తావించారు. ‘2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణ వస్తుందా? ఈ ఉద్యమం సాధ్యమవుతుందా? అనే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేసీఆర్ పాట రాశారు’ అన్నారు. 

మరిన్ని వార్తలు