బాధిత పోలీసుల కుటుంబాలకు రూ.5.1 లక్షల చెక్కుల పంపిణీ
సిద్దిపేట క్రైం, నవంబర్ 2 : విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందిన సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీసు కానిస్టేబుల్స్ కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర పోలీసు సంక్షేమ విభాగం(Telangana State Police Welfare Department) నుంచి మంజూరైన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పరిహారం చెక్కులను సీపీ రష్మి పెరుమాళ్ అందజేశారు. విధుల్లో మరణించిన కానిస్టేబుళ్లు వి.పరంధాములు, పి.వెంకటేశం, పి.నవీన్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ.5.10 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులను కమిషనర్ కార్యాలయంలో సీపీ అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడంలో పోలీసు సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ ఫలాలను, డిపార్ట్మెంట్ సహాయక చర్యలను త్వరితగతిన అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏవో రమాదేవి, సూపరింటెండెంట్ అలీషా నిమ్మల, జూనియర్ అసిస్టెంట్ రవిరాజు పాల్గొన్నారు.