బ్యాగు తెరిస్తే రూ.60 లక్షల నకిలీ నోట్లు!

01-11-2026 | 07:11pm

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station)లో భారీగా నకిలీ కరెన్సీ(Fake Currency) పట్టుబడటం కలకలం రేపింది. సాధారణ ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఓ యువకుడి బ్యాగులో కట్టలు కట్టలుగా నకిలీ నోట్లు బయటపడటంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి నకిలీ కరెన్సీని తరలించే ప్రయత్నం చేసిన యువకుడిని GRP, RPF పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.60 లక్షల ముఖ విలువ కలిగిన నకిలీ భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్ పరిచయమయ్యాడు. నకిలీ నోట్లను ముంబైకి చేరవేస్తే రూ.20 వేలు ఇస్తానని ఆశ చూపించాడు. అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్‌లో నకిలీ నోట్లతో కూడిన బ్యాగును అతడికి అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.

ముందుగా కాచిగూడకు వెళ్లి, అక్కడి నుంచి ముంబైకి బయలుదేరాలని సూచించాడు. దీంతో యువకుడు హైదరాబాద్ చేరుకుని కాచిగూడలోని ఓ లాడ్జిలో బస చేశాడు. మరుసటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతడి ప్రయాణ ప్రణాళికకు పోలీసుల తనిఖీలు అడ్డుకట్ట వేశాయి. అనుమానంతో తనిఖీలు చేపట్టిన GRP, RPF సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

బ్యాగును తెరిచి చూడగా రూ.60 లక్షల విలువైన నకిలీ నోట్లు బయటపడ్డాయి. విచారణలో ముంబైలోని ఓ వ్యక్తికి ఈ నోట్లను అందజేయాల్సి ఉందని యువకుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న ఓం ప్రకాశ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.20 వేల ఆశతో రూ.60 లక్షల నకిలీ కరెన్సీని తరలించేందుకు ప్రయత్నించిన ఈ ఘటన వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఈ నకిలీ నోట్ల నెట్‌వర్క్ ఎక్కడి నుంచి పనిచేస్తోంది? ముంబైలో వాటిని స్వీకరించాల్సిన వ్యక్తి ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు