సన్నబియ్యం ధరలు ఫిక్స్.. ఏ రకం ఎంతంటే?

01-11-2026 | 01:22pm

ఇక ఇష్టారాజ్యంగా అమ్మితే కుదరదు.. బియ్యం ధరలపై సర్కార్ ఆంక్షలు!

హైదరాబాద్: తెలంగాణలో సన్నబియ్యం ధరల నియంత్రణపై పౌరసరఫరాల శాఖ(Civil Supplies Department) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల సన్నబియ్యానికి గరిష్ట విక్రయ ధరలను (Maximum Retail Price) నిర్దేశిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లు, ట్రేడర్లు, వ్యాపారులను హెచ్చరించింది. మార్కెట్‌లో ధరల నియంత్రణతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ నిర్ణయించిన ధరల ప్రకారం.. BPT, KNM రకం సన్నబియ్యం కిలో గరిష్టంగా రూ.66కు విక్రయించాలి. తెలంగాణ సోనా, RNR రకం బియ్యం కిలో ధర రూ.74గా నిర్ణయించారు. HMT, JSR రకం సన్నబియ్యం కిలో గరిష్ట ధరను రూ.79గా ఖరారు చేశారు. ఈ Price List అన్ని రకాల విక్రయ కేంద్రాల్లో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు.

నిర్దేశించిన Rate కంటే ఎక్కువ ధరకు బియ్యం అమ్మితే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మిల్లర్లు, హోల్‌సేల్ డీలర్లు, రిటైల్ వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ధరల విషయంలో అక్రమాలకు పాల్పడకుండా మార్కెట్‌పై అధికారులు పర్యవేక్షణ కొనసాగించనున్నారు. మరోవైపు వినియోగదారులు కూడా బియ్యం కొనుగోలు చేసే సమయంలో దుకాణాల్లో ప్రదర్శించిన ధరల పట్టికను పరిశీలించాలని సూచిస్తున్నారు. నిర్ణయించిన గరిష్ట ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ధరల నియంత్రణ చర్యలతో సన్నబియ్యం మార్కెట్‌లో ధరలు అదుపులోకి వస్తాయా? అనేది చూడాలి.

మరిన్ని వార్తలు