శివాలయంలో ఘనంగా జ్వాలా తోరణం

24-11-2026 | 08:34pm

దమ్మపేట, నవంబర్ 24(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయంలో(Visvesvaraswami Temple) కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జ్వాలా తోరణం(Jwala Thoranam) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాన్ని పూల మాలలతో సుందరంగా అలంకరించారు.

తెల్లవారు జాము నుండే శివాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్వాలా తోరణం అనేది కార్తీక పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో శివాలయం ముందు జరిగే ఒక ముఖ్యమైన ధార్మిక ఆచారం. శివాలయం ఎదురుగా రెండు పెద్ద స్తంభాల మధ్య ఎండు గడ్డితో తోరణం కట్టి, దానిపై ఆవు నెయ్యి వేసి అగ్గి రాజేసి, ఆ అగ్ని జ్వాలల కింద నుంచి పరమేశ్వరుడి ఉత్సవ విగ్రహాలను ఎత్తుకుని ఆ జ్వాలల క్రింద భక్తులు నుండి నడచి వెళ్ళారు. జ్వాలా తోరణం వెనుక ఉన్న పురాణ కథ

త్రిపురాసుర సంహారం తర్వాత శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తున్న సమయంలో దేవతలు సంతోషంతో అగ్ని జ్వాలలతో తోరణం కట్టి స్వాగతం పలికారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. జ్వాలా తోరణం కింద నుంచి నడవడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు, దృష్టి దోషాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

తోరణం కాలి కిందకి పడిన తర్వాత, ఆ భస్మాన్ని నుదుటన ధరించారు. ఈ భస్మాన్ని పెట్టుకుంటే గ్రహ దోషాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమాన్ని శివాలయ చైర్మన్ పానకాల సత్యనారాయణ, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.

మరిన్ని వార్తలు